వర్షంలో మునిగిపోయిన ముంబయి మహానగరం

Update: 2019-09-05 05:00 GMT
కాసింత వర్షం పడితే చాలు వర్షపు నీటిలో మహానగరాలు మునిగిపోయే దుస్థితి మన దేశ దౌర్భాగ్యం. అలాంటిది ఆకాశానికి చిల్లులు పడినట్లుగా అదే పనిగా.. ఏకధాటిగా వర్షం కురిస్తే పరిస్థితేంటి? ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కోంటోంది ముంబయి మహానగరం. ఈ ఏడాది ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రెండుసార్లు మునిగిన ముంబయి మహానగరం.. తాజాగా మరోసారి అలాంటి ఇబ్బందిని ఎదుర్కోంటోంది.

విడవకుండా పడుతున్న వర్షం కారణంగా.. ముంబయి మహానగరానికి సమాంతరంగా ఉండే అరేబియా సముద్రాన్ని తలపించేలా దేశ ఆర్థిక రాజధాని మారింది. ముంబయి.. చుట్టుపక్కల ప్రాంతాలు సైతం భారీ వర్షం కారణంగా వాన నీటిలో మునిగిపోయాయి.  నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.

రోడ్ల మీద డివైడర్లను సైతం ముంచెత్తేశాయి వర్షపు నీరు. దీంతో.. డివైడర్లు.. గుంతలు ఎక్కడ ఉన్నాయో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. విడవకుండా కురుస్తున్న వానలు ఈ రోజు కూడా పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

దీంతో.. ఇళ్లల్లో నుంచి బయటకురావటానికి ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తగ్గట్లే అధికారులు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రధాన రహదారులే చెరువులుగా మారిన వేళ.. లోతట్లు ప్రాంతాల పరిస్థితి మరెంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అసవరం లేదు. ఇక.. విదర్భ - కొంకణ్ ప్రాంతాల్లో వందకు పైగా గ్రామాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.

స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించింది ప్రభుత్వం. ముంబయి ప్రజా రవాణాకు కీలకమైన లోకల్ ట్రైన్లు నడవటం లేదు. ట్రాక్ మీదకు నీరు వచ్చి చేరటంతో రైళ్లను నడిపే అవకాశం లేదు. దీంతో.. ప్రజారవాణా ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ముంబయి ప్రజలు ఎక్కువగా ఆధారపడే లోకల్ ట్రైన్ల రాకపోకలు ఆగిపోవటంతో.. ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లటం ఇబ్బందికరంగా మారింది.

తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. వర్షం కారణంగా చోటు చేసుకున్న పరిస్థితులు చక్కబడి.. సాధారణ పరిస్థితులు నెలకొనటానికి కనీసం నాలుగు రోజులైనా పడుతుందన్న అంచనా వేస్తున్నారు. వినాయకచవితిని భారీగా జరుపుకునే ముంబయి ప్రజలకు తాజా వర్షాలు ఇబ్బందికరంగా మారాయి. చవితి వేడుకల్ని జరుపుకోవటంలో వారు ఇక్కట్లు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. తాజాగా మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబయిలో 20 విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకోవటంతో 280 విమాన రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ఒక అంచనా ప్రకారం ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజూ వెయ్యి వరకూ విమాన రాకపోకలు జరుగుతుంటాయి. భారీ వర్షాల కారణంగా 44 శాతం విమానాలు ఆలస్యంగా రావటం.. మరింత ఆలస్యంగా టేకాఫ్ తీసుకోవటం జరిగింది.

ముంబయి-ఢిల్లీ ఇండిగో విమాన సర్వీసు ఆరు గంటల పాటు రన్ వే మీద నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పైలెట్.. విమానసిబ్బంది వర్షంలో చిక్కుకుపోవటం.. వారు ఎయిర్ పోర్ట్ కు రావటంలో ఆలస్యం కావటంతో.. ఆ ప్రభావం విమాన ప్రయాణికుల మీద పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. బోలెడన్ని ఇబ్బందులతో ముంబయి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షం ఏమో కానీ.. ముంబయిన్లకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షం తమ దరికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లుగా  చెబుతున్నారు.
Tags:    

Similar News