గులాబీ ఎమ్మెల్యేకు హైకోర్టు ఊరట

Update: 2019-11-22 10:55 GMT
కొద్దికాలంగా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన పౌరసత్వం రద్దు చేయాలని కోరుతూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాసరావు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయటం తెలిసిందే.

దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం.. చెన్నమనేని భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్ులగా ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాల్ని దాచి పెట్టి మోసపూరిత విధానాలతో చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వాన్ని పొందినట్లుగా ప్రకటించింది.

2010లో టాండన్ తో కలిపి త్రిసభ్య కమిటీని నియమించింది. తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులని.. తాను జర్మనీలో చదువుకున్నాని.. 1993లో జర్మనీ పౌరసత్వం పొందినట్లు చెన్నమనేని కమిటీ ముందు తన వాదనలు వినిపించారు.

వాదనలు విన్న కమిటీ చెన్నమనేని పౌరసత్వం చెల్లదని తేల్చింది. దీంతో 2017లో హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ రమేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. ఈ విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని స్పష్టం చేస్తూ కోర్టు ఈ ఏడాది జులైలో ఆదేశాలు ఇచ్చింది.

దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఇరు పక్షాలు తమ వాదనలు హోంశాఖ ముందు వినిపించాయి. వీరిద్దరి వాదనలు విన్న హోంశాఖ చెన్నమనేని పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది. ఈ నెల 20న దీనికి సంబంధించి 13 పేజీల ఉత్తర్వులను ఇచ్చింది. ఇలాంటివేళ చెన్నమనేని తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నాలుగు వారాలు నిలిపివేస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ కేసు విచారణను వచ్చే నెల (డిసెంబరు) 16కు వాయిదా వేసింది. చూస్తుంటే.. సుదీర్ఘంగా సాగుతున్న చెన్నమనేని పౌరసత్వ వివాదం మరికొంత కాలం సాగటం ఖాయమన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News