ఆ కేసులో మహిళా ఐఏఎస్‌ అధికారికి హైకోర్టు ఊరట!

Update: 2022-11-08 12:30 GMT
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా కర్ణాటకలోనూ వివాదాస్పదంగా మారిన అంశం.. ఓబుళాపురం మైనింగ్‌. హద్దులు చెరిపేసి.. దేవాలయాలను కూలగొట్టి.. అధికారులను బెదిరించి.. అటవీ శాఖ ఆంక్షలను సైతం ధిక్కరించి గాలి జనార్దన్‌రెడ్డి అండ్‌ కో ఓబుళాపురంలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజాన్ని తవ్వేసిన సంగతి తెలిసిందే.

ఓబుళాపురం మైన్స్‌ కంపెనీకి అనుమతులు ఇవ్వడంలో అప్పట్లో కీలక పాత్ర పోషించారని నాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. శ్రీలక్ష్మి తన పదవిని పోగొట్టుకుని కొన్నాళ్లు పాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.

ఈ కేసులో తాజాగా శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం కొట్టివేసింది.

అనుమతులు ఇచ్చినందుకు ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారని శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సంవత్సరంపాటు జైలులో ఉన్నారు.

2004 – 2009లో శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న సమయంలో ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వడం గమనార్హం.

చిన్న వయసులోనే ఐఏఎస్‌ అయిన శ్రీలక్ష్మి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ స్థాయికి ఎదుగుతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓబుళాపురం వ్యవహారంతో అది పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News