పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వచ్చేసింది

Update: 2015-09-28 06:33 GMT
హైకోర్టు నుంచి వరుస ఎదురుదెబ్బలు తింటున్న తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఊరట లభించినట్లే. తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న ఒక కీలక అంశంపై హైకోర్టు విచారణకు తిరస్కరించటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు  నైతిక స్థైర్యాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు.. తెలంగాణ అధికారపక్షంలో చేరటంపై కొందరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లిన నేతలపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. ఈ పిటీషన్ ను విచారణకు సంబంధించి ఇరు వర్గాల వాదనను విన్న హైకోర్టు తన తీర్పును తాజాగా వెల్లడించింది.

ఎమ్మెల్యేల అనర్హత అంశం ప్రస్తుతం శాసనసభ స్పీకర్ దగ్గర ఉన్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఈ అంశంపై స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తాము భావిస్తున్నట్లుగా హైకోర్టు పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో..కీలకమైన అనర్హత వేటు అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికారపక్షానికి పెద్ద ఊరటగా.. విపక్షాలకు నిరాశ కల్పించేదన్న భావన వ్యక్తమవుతోంది.

కోర్టు తీర్పుపై టీడీఎల్పీ నాయ‌కుడు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు మీడియాతో స్పందించారు. తాము ఈ విష‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని తెలిపారు. గెలిచిన‌ పార్టీ ఒక‌టైతే..మ‌రో పార్టీలో చేరిపోవ‌డం ఆ ఎమ్మెల్యేల రాజ‌కీయ విధానాల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.
Tags:    

Similar News