కుప్పం పోలీసులకు పంచ్ వేసిన హైకోర్టు

Update: 2021-11-11 04:30 GMT
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ పీవీ హయాంలో మొదలైన మాట.. అప్పటి నుంచి అధికారపక్షానికి అనుగుణంగా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాగుతున్న వైనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నదే. అయితే.. గతంలో మరెప్పుడూ లేనంత కొత్త పోకడలు ఏపీలో ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. అధికార బదిలీ మామూలే అయినా.. ప్రభుత్వం మారిన తర్వాత పాత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన నేతల్ని వరుస పెట్టి అరెస్టు చేసిన వైనం ఇటీవల కాలంలో చూసింది లేదు.

కాలు కదిపితే కేసులు.. నోరు విప్పితే చర్యలు.. మొత్తంగా మూడు అరెస్టులు ఆరు కేసులన్నట్లుగా సాగుతోంది ఏపీ పోలీసుల వ్యవహారం. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఉదంతమే దీనికి నిదర్శనం. అక్కడ జరుగుతున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి నామినేషన్ ను ఉఫసంహరించుకున్నట్లుగా దొంగ డాక్యుమెంట్లతో పోటీలోనే లేకుండా చేసిన వైనం షాకింగ్ గా మారింది.

దీనికి నిరసనగా మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో పాటు పలువురు స్థానిక మున్సిపల్ కార్యాలయంవద్ద నిరసన నిర్వహించటం.. ఆ వెంటనే వారిపై చర్యలకు పోలీసులు ప్రదర్శించిన వేగాన్ని చూసినోళ్లంతా అవాక్కు అయ్యే పరిస్థితి. దీని నుంచి తేరుకోకముందే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో సహా పలువురిని రాత్రి పదకొండు గంటల వేళలో.. భోజనం చేస్తున్న వేళలో చుట్టుముట్టి అరెస్టు చేయటం అందరిని ఆశ్చర్యపోయింది. నిబంధనలకు విరుద్దంగా నిరసన నిర్వహించారనే అనుకుందాం.. దానికి వాయు వేగంతో అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న.

కుప్పం పోలీసుల తీరుపై మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో పాటు మరో 19 మంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమను అన్యాయంగా అరెస్టు చేస్తున్న వైనాన్ని వారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. తెలుగు దేశం పార్టీ నేతలకు ఊరట కలిగిస్తూ మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. మున్సిపల్ ఆఫీసు వద్ద నిర్వహించిన నిరసన నేపథ్యంలో నమోదు చేసిన కేసుల్లో పిటిషనర్ల అరెస్టుకు తొందరపాటు వద్దని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది.
Tags:    

Similar News