హైకోర్టు షిఫ్టింగ్ : అమరావతి టూ కర్నూలు...కేంద్రం మాటేంటంటే...?

Update: 2022-07-22 10:30 GMT
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇపుడు అమరావతిలో ఉంది. దీన్ని కర్నూలుకి తరలించాలన్నది ప్రస్తుత్వ వైసీపీ సర్కార్ గట్టి ఆకాంక్ష. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే మూడు రాజధానుల ప్రతిపాదనలు రెడీ చేసింది. హైకోర్టుని కర్నూలు కి తరలించడానికి పెట్టిన పేరు న్యాయ రాజధాని అని. ఆ విధంగా హైకోర్టుని కర్నూలుకి ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.

దీనికోసం శ్రీ భాగ్ ఒప్పందాన్ని కూడా ఉటంకిస్తోంది. నాడు అంటే 1937 ప్రాంతంలో కోస్తా రాయలసీమ పెద్ద మనుషుల మధ్యన కుదిరిన ఒప్పందం మేరకు రాజధాని ఉన్న చోట హైకోర్టు ఉండరాదు, ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలని. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం 1953లో  ఏర్పాటైనపుడు హైకోర్టుని గుంటూరుకు ఇచ్చారు. ఆ మీదట 1956లో నాటి హైదరాబాద్ స్టేట్ ని కలుపుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం అవతరించింది. అపుడు గుంటూరులోని హైకోర్టు కూడా హైదరాబాద్ కి వెళ్లిపోయింది.

తిరిగి ఆరు దశాబ్దాల తరువాత రాష్ట్రం రెండు గా విభజించబడింది. అంటే 1952 నాటి ఆంధ్రా మళ్ళీ వెనక్కి అదే రూపాన తిరిగి వచ్చిందన్న మాట. ఆ విధంగా చూస్తే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే హైకోర్టు కర్నూలుకి ఇవ్వాలన్న పాత ఒప్పందాన్ని రాయల‌సీమ వాసులు గుర్తు చేశారు. అయితే చంద్రబాబు జమానాలో అన్నీ ఒకేచోట అన్న సూత్రాన్ని అనుసరించి అమరావతిలోనే  హైకోర్టు ఉంచేశారు.

ఇక వైసీపీ సర్కార్ కర్నూల్ కి హైకోర్టు తో పాటు విశాఖకు పాలన రాజధాని అంటూ మూడు రాజధానుల చట్టం చేసింది. ఆ మీదట దాన్ని విరమించుకుంది కూడా. అయితే ఇపుడు మళ్లీ మూడు రాజధానుల మీద గట్టిగా ప్రకటనలు వస్తున్నాయి. దానిలో భాగంగా ముందు హైకోర్టు ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించాన్నది కీలకంగా మారుతోంది.

దీంతో దీని మీద కేంద్రం ఆలోచనలు ఏంటి అన్నది కూడా ఆసక్తికరమే. అయితే ఈ రోజు లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ రాష్ట్ర హై కోర్టుని అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలన్న ప్రతిపాదన అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిందని చెప్పారు.

అయితే ఈ విషయంలో హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అనడం విశేషం. ఆ తరువాత రెండు వైపుల నుంచి ఉమ్మడిగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని కూడా అన్నారు. ఇక హైకోర్టు తరలింపు నిర్వహణ ఖర్చుకు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే బంతి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో మాట్లాడి రెండు వైపుల నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి అందాలని ఆయన అంటున్నారు. అంటే ఈ విషయంలో వైసీపీ సర్కార్ రాష్ట్ర హైకోర్టుతో మాట్లాడాలి అన్న మాట. ఇక హైకోర్టు కూడా అంగీకరిస్తేనే ఈ తరలింపు అన్నది ముందుకు వెళ్తుంది. అంటే అనుకోగానే ఈ విషయంలో ఏమీ అంత తొందరగా జరగదు అనే అంటున్నారు. చూడాలి మరి వైసీపీ సర్కార్ కేంద్ర మంత్రి ప్రకటన తరువాత ఏమంటుందో ఏం చేస్తుందో.
Tags:    

Similar News