''లారీ డ్రైవర్‌'' ఆర్టీసీ బస్సుని నడిపారు

Update: 2015-04-15 06:03 GMT
రీల్‌ లైఫ్‌లో నటించటం వేరు. రియల్‌ లైఫ్‌లో అదే పాత్రను సమర్థంగా పోషించటం వేరు. రీల్‌లైఫ్‌లో ఎంత సమర్థంగా పాత్రను పోషించారో.. అంతేలా రియల్‌లైఫ్‌లో ఆర్టీసీ బస్సును నడిపిన సినీహీరో.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన సత్తాను చాటారు.

అప్పుడెప్పుడో వచ్చిన లారీడ్రైవర్‌ సినిమాలో డ్రైవర్‌గా నటించిన బాలకృష్ణ.. తనకున్న డ్రైవింగ్‌ ప్రావీణ్యాన్ని తాజాగా ప్రదర్శించారు. అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్త ఆర్టీసీ బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సదరు బస్సును పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఆయన.. అక్కడితో ఆగకుండా తానే స్వయంగా డ్రైవర్‌ సీట్లో కూర్చొని డ్రైవింగ్‌ చేశారు. బస్సును హుషారుగా నడపటంతో అక్కడి వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

అంతాబాగానే ఉంది కానీ.. బస్సును నడపటానికి అవసరమైన హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ బాలయ్యబాబుకు ఉందా? అయినా.. వియ్యంకుడే ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో.. అధికారపక్ష ఎమ్మెల్యేను డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా అని అడిగే ధైర్యం ఎవరు మాత్రం చేయగలరు..?

Tags:    

Similar News