మేన‌కోడ‌లి శ‌వాన్ని భుజంపై వేసుకొని....

Update: 2017-06-15 11:19 GMT
ఒరిస్సాలో భార్య శ‌వాన్ని భుజాన ఎత్తుకొని 12 కిలోమీట‌ర్లు నడిచిన ధ‌నా మాంజీ ఉదంతం గుర్తుందా? ఆ ఘ‌ట‌న‌ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఆసుప‌త్రుల్లో పెరిగిపోయిన అవినీతికి ప‌రాకాష్ఠ‌గా ఆ ఘ‌ట‌న నిలిచింది. అటువంటి ఘ‌ట‌న‌లు ఎన్ని జ‌రిగినా లంచాల రుచి మ‌రిగిన ఆసుప‌త్రి సిబ్బందికి చ‌ల‌నం ఉండ‌దు. స‌రిగ్గా అటువంటి ఘ‌ట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్‌ లోని మజ్ హన్ పూర్, మలాక్ సద్దీ గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. త‌న‌ మేన‌కోడ‌లు  పూనమ్ వాంతులు - విరోచనాలతో బాధ‌ప‌డుతుండ‌డంతో ఆమె మామ‌య్య బ్రిజ్ మోహ‌న్‌ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ పాప తండ్రి ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు సంపాదించ‌డానికి కూలీ ప‌నికి వెళ్లాడు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆ పాప మృతిచెందింది.

ఆమెను తీసుకెళ్ల‌డానికి అంబులెన్స్ కావాల‌ని మోహ‌న్‌ అడిగాడు. అయితే, కాసులకు క‌క్కుర్తి ప‌డ్డ అక్క‌డి  సిబ్బంది త‌మ చేయి త‌డ‌ప‌నిదే అంబులెన్స్‌ క‌ద‌ల్చ‌మ‌ని చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక‌ ఆ చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకొని సైకిల్‌ పై గ్రామానికి తీసుకు వెళ్లాడు మోహ‌న్‌.

ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో ఉన్న‌తాధికారులు స్పందించారు. ఘటనపై స్పందించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ పూర్తి విచార‌ణ‌కు ఆదేశించారు. అంబులెన్స్‌ డ్రైవర్ తో పాటు ఓ వైద్యుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంబులెన్స్ స‌ర్వీసుని కొన‌సాగించ‌డానికి డీజిల్ కు డబ్బులేక పోవడం వల్లే ఈ విధంగా జ‌రిగింద‌ని ఆసుప‌త్రి అధికారులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News