హైదరాబాద్ లో ఇళ్లు ఇప్పుడు బంగారం..

Update: 2022-07-29 02:30 GMT
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇతర ప్రజాప్రతినిధులు తెలంగాణ రోల్ మోడల్ గా తయారైందని అంటున్నారు. అయితే తాజా పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం చేరుతోంది.

హైదరాబాద్లో శ్రీమంతులు ఏ విధంగా పెరుగుతున్నారో.. అంతే స్థాయిలో ఖరీదైన భవనాలు కూడా నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఉద్యోగ భద్రత పెరగడం, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన, మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పడడంతో నగర రియల్టీ మార్కెట్ పుంజుకుంటుందని రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ప్రాప్ టైగర్ అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా చూస్తే అన్ని నగరాల కంటే హైదరాబాద్ లో రియల్ భూమ్ భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఈ జూన్ త్రైమాసికంలో 12శాతం పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇక్కడ చదరపు అడుగు ధర రూ.5760 ఉండగా.. ఇప్పుడు రూ.6472కు చేరిందని పేర్కొంది. ఇళ్ల విక్రయాల్లోనూ 77 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది 8176 ఇళ్లు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 14457కు చేరింది.

దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 9 ప్రధాన నగరాల్లో గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ఇళ్ల ధరల సగటు వృద్ధి 15శాతం ఉందని నివేదిక తెలిపింది. చెన్నైలో అత్యధికంగా ఇళ్లధరలు 15శాతం పెరిగాయి. నోయిడాలో 9శాతం వృద్ధి చెందింది. బెంగళూరులో 8శాతం, ముంబై, థానే, పుణెలలో 3శాతం చొప్పున ధరలు పెరిగాయి. అత్యల్పంగా కోల్ కతాలో కేవలం 1 శాతం మేరకే ధరలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 9 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 96 శాతం పెరిగాయి.

హైదరాబాద్లో గత ఐదేళ్లలో రియాల్టీ బిజినెస్ విపరీతంగా పెరిగింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ ల మధ్య నగర స్థిరాస్తి ధరలు 7 శాతం పెరిగాయి. పెరిగిన ధరల తరువాత దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై తరువాత హైదరాబాద్ కే దక్కింది. కరోనా మహమ్మారి తరువాత నగరంలో భవన నిర్మాణాలు విపరీతంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా నిర్మాణ సామగ్రి రేట్లు కూడా పెరిగాయి. దీంతో కొత్త అపార్ట్ మెంట్ల ధరలు కూడా ఎగబాకాయి.

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చదరపు అడుగులకు రూ.5,900 నుంచి రూ.6,100 వరకు ఉంది. గతేడాది క్యూ4లో అహ్మదాబాద్ తో సహా నగరంలో అత్యధిక ధరలు నమోదయ్యాయని ప్రాప్ టైగర్ బిజినెస్ హెడ్ రాజన్ పేర్కొన్నారు. 2020 క్యూ 4 తో పోలిస్తే గతేడాది క్యూ 4 లో హైదరాబాద్ గృహాల విక్రయాల్లో 36 శాతం వృద్ధి రేటు కనిపించింది. 2020 నాల్గో త్రైమాసికంలో 16,400 యూనిట్లు విక్రయం కాగా.. గతేడాది అక్టోబర్ -డిసెంబర్లో 22,239 గృహాలు విక్రయాలు జరిగాయి. మియాపూర్, బాచుపల్లి, తెల్లాపూర్ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు అత్యధికంగా సాగాయి. ఇక ప్రజలు త్రిబుల్ బెడ్రూం ప్లాట్ల కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అత్యధిక మెరాజిటీ యూనిట్ల లాంగింగ్స్ పుష్పాలగూడ, మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో జరిగాయి.ఇలా హైదరాబాద్ లో ఇళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇళ్ల విక్రయాల్లో ఏకంగా 77 శాతం వృద్ధి నమోదైంది.
Tags:    

Similar News