తెలంగాణలో తొలి కరోనా మరణం తాలుకూ డేంజర్ ఎంత?

Update: 2020-03-29 18:30 GMT
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్.. బయటకు వచ్చే విషయంలో ఆంక్షలు.. ఏ మాత్రం అనుమానం వచ్చినా కరోనా పరీక్షలు జరపటం మొదలు.. ఐసోలేషన్ వార్డులకు తరలింపు.. చికిత్సను అందించటం లాంటివి చోటు చేసుకుంటున్న వేళ.. అనూహ్యంగా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక మరణం అందరిని ఉలిక్కిపడేలా చేస్తోంది. అధికార యంత్రాంగం అయితే.. ఆ మరణం తాలూకు తీవ్రత ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరణించిన వ్యక్తి పెద్ద వయస్కుడు కావటం ఒకటైతే.. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని గుర్తించకపోవటం మరో కీలకాంశం. ట్రావెల్ హిస్టరీలో విదేశీ ప్రయాణం లేకపోవటంతో వైద్యులు పెద్దగా అనుమానపడలేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నెల 26న లక్డీకాఫూల్ లోని తాను నివాసం ఉండే ఇంట్లోనే తీవ్రమైన జ్వరంతో కుప్పకూలిపోయారు. దగ్గర్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వారు తొలుత అనుమానించి వెంటనే గాంధీకి సమాచారం అందించారు. ఉరుకులు పరుగులు పెట్టి వచ్చే సమయానికి.. ఆయన మరణించారు. ప్రత్యేక అంబులెన్స్ లో తరలించి.. ఆయన మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అనంతరం చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

మరణానికి ముందు తీవ్రమైన న్యూమోనియా లక్షణాలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఆయన ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లి రావటం.. అనంతరం అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. దగ్గర్లోని ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లారు. ఆయన లక్షణాల్ని మామూలు అనారోగ్యంగా భావించి మందులు ఇచ్చారు. మందులు వాడినంతనే తగ్గిపోవటం.. మళ్లీ వచ్చినా.. సాధారణ కేసుగానే భావించారే తప్పించి.. కరోనాగా అనుమానించలేదు.

దీంతో.. ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. తాజాగా ఆయన మరణం కరోనాతో అన్న విషయం తేలటంతో.. ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని.. ఆయనకు ట్రీట్ మెంట్ ఇచ్చిన వైద్యుడితోపాటు.. వారి సిబ్బంది.. సదరు బాధితుడితో పాటు.. ఢిల్లీకి వెళ్లిన ఆయన సన్నిహితుడు.. ఇరుగుపొరుగు వారు.. ఇలా పలువురికి పరీక్షలు జరపాల్సిన పరిస్థితి. మృతి చెందిన వ్యక్తి ఇంటికి గడిచిన రెండు వారాల్లో ఎంతమంది వచ్చారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న ఆరాతో పాటు.. వారి కారణంగా మరెవరైనా ప్రభావానికి గురయ్యారా? అన్నది తేల్చాల్సిన పెద్ద పని ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మీద పడింది.

కరోనాను తొలిదశలోనే గుర్తిస్తే జరిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాప్తిని వెంటనే చెక్ పెట్టే వీలుంది. ఇప్పుడు ఎదురైన ఉదంతాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి.. సదరు వ్యక్తితో కాంటాక్టు అయిన వారెంతమంది? దానికి సంబంధించిన ఆరాను పెద్ద ఎత్తున చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో ఇది ఒక కొలక్కి వస్తుందని.. అప్పుడు మాత్రమే తీవ్రత ఎంతన్నది తేలే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. ఏ మాత్రం అంచనా లేకుండాతెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న తొలి కరోనా మరణం అధికార యంత్రాన్ని షాక్ కు గురి చేయటంతో పాటు.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్నది ప్రశ్నగా మార్చిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News