ఒకే ఒక్క‌డితో స‌భ ఎలా నెగ్గుకొస్తారు కేసీఆర్‌?

Update: 2019-02-07 05:48 GMT
నిజ‌మే.. ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్ర‌మే చేయగ‌ల‌రు. ఆ విష‌యాన్ని ఇప్ప‌టికే ఆయ‌న ప‌లుమార్లు నిరూపించారు కూడా. ఒక ముఖ్య‌మంత్రి ఎనిమిది వారాల‌కు పైనే మంత్రివ‌ర్గం అన్న‌ది లేకుండా పాల‌న చేయ‌గ‌ల‌రా? అంటే.. అవును.. చేయ‌గ‌ల‌ర‌న్న విష‌యాన్ని చేత‌ల్లో చేసి చూపించారు. ఒకే ఒక్క‌డు మ‌హ‌మూద్ అలీ ఒక్క‌రు మాత్ర‌మే కేసీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రులు అన్న వారే లేకుండా స్వ‌ల్ప వ్య‌వ‌ధికి మంత్రివ‌ర్గం అన్న‌ది లేకుండా ఉన్నారు. అది త‌ప్పించి మ‌రే ముఖ్య‌మంత్రి కూడా మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌కుండా పాల‌న సాగించింది లేదు. నిజానికి ఆ ఆలోచ‌న చేయ‌టానికి సైతం భ‌య‌ప‌డే ప‌రిస్థితి. ఇందుకు భిన్నంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బిందాస్ గా ఒక్క మంత్రితో ప్ర‌భుత్వ ర‌థాన్ని లాగించేస్తున్నారు.

ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్ణ‌యాల్ని కాద‌నే ధైర్యం ఎవ‌రికీ లేదు. ప్ర‌జ‌లు సైతం పెద్ద‌గా ప‌ట్టించుకోని ప‌రిస్థితి. ఆంధ్రాతో పోలిస్తే చైత‌న్య‌వంతులైన స‌మాజం తెలంగాణ‌లో ఉంద‌న్న మాట‌కు భిన్నంగా తాజా ప‌రిస్థితులున్నాయి. బ‌ల‌మైన నేత‌లు సైతం మాట్లాడ‌కుండా ఉండిపోతున్నారు. కేసీఆర్  బ‌లానికి వారు మోక‌రిల్లిపోయారు. సీఎం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా జీహుజూర్ అన‌టం మిన‌హాయించి.. ఇది కాదేమో అన్న మాటను నోటి నుంచి వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. ఒక‌వేళ వ‌చ్చిన ప‌క్షంలో అలాంటి వారు ఆయ‌న‌కు ద‌రిదాపుల్లోకి రాలేని పరిస్థితి దృష్ట్యా.. మారిన వాతావ‌ర‌ణానికి త‌గిన‌ట్లుగాఅంద‌రూ మారిపోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే..త్వ‌ర‌లో ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల మాటేమిటి? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక్క మంత్రితో అసెంబ్లీ స‌మావేశాల్ని ఎలా నిర్వ‌హిస్తారు. విప‌క్షం అడిగే ప్ర‌శ్న‌కుబ‌దులిచ్చే వారెవ‌రు?  శాస‌న స‌భా వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ సైతం ముఖ్య‌మంత్రి వ‌ద్దే ఉండిపోవ‌టంతో.. అన్ని ప‌నుల్ని సీఎం చేస్తారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

దేనికైనా రెఢీ అన్న‌ట్లుగా ఉండే కేసీఆర్‌.. ఇలాంటి ప‌రిస్థితి గురించి ఆలోచించ‌కుండా ఉంటారా? అన్న మాట ఆయ‌న స‌న్నిహితుల నుంచి వినిపిస్తోంది. ఆయ‌నేం చేసినా ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేద‌న్నప్పుడు.. తాను తోచింది.. త‌న‌కు న‌చ్చింది చేసే కేసీఆర్‌.. అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌లో కొత్తద‌నాన్ని తీసుకొస్తారేమో చూడాలి. ఏమైనా..ముఖ్య‌మంత్రి..  ఒక్క మంత్రి మాత్ర‌మే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాలు ఆస‌క్తిక‌రంగానే కాదు.. దేశ రాజ‌కీయాల‌కు స‌రికొత్త అనుభూతిని మిగ‌ల్చ‌నున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News