సిఫార్సుకు మించి ఫిట్ మెంట్.. ఇదెప్పటి నుంచి మొదలైందంటే?

Update: 2021-03-23 07:34 GMT
ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగే జీతంలోని ప్రతి పైసా జనాల జేబుల్లో నుంచి వెళ్లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే..మనం కట్టే పన్నులతో వచ్చే ఆదాయమే ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ వనరుగా మారుతుంది. ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగుల మధ్య ఆదాయాల విషయంలో వ్యత్యాసం ఎంతన్న విషయం అందరికి తెలిసిందే. అయితే.. న్యాయబద్ధంగా.. హేతుబద్ధంగా జీతాల పెంపుఉండటాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ.. అందుకు భిన్నంగా ఓట్ల రాజకీయంలో పడిన ప్రభుత్వాలు.. వేతన సవరణ కమిషన్ చేసే సూచనల్ని పక్కన పెట్టేసి.. తానే సొంతం ఇచ్చేయటం చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.

ప్రభుత్వం ఏర్పాటు చేసే వేతన సవరణ కమిషన్.. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని గమనించి.. ఫిట్ మెంట్ ఎంత ఉండాలన్న సిపార్సులు చేస్తుంటారు. అయితే.. వేతన సవరణ కమిషన్ పేర్కొన్న దాని కంటే ప్రభుత్వం ఎంత ఎక్కువ ఇచ్చిందో చూశారా? అన్న భావన కలుగజేయటం కోసం.. ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అన్న భావన కలుగజేయటం కోసం తమకుతోచిన రీతిలో ఫిట్ మెంట్ ను ఖరారు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.

గతంలోని ఒక్కసారి తొంగి చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో 1958లోకాసు బ్రహ్మానందరెడ్డి కమిషన్ రెండు నుంచి ఐదేళ్ల సర్వీసుకు ఒక ఇంక్రిమెంట్ చొప్పున పెంచాలని సిఫార్సు చేస్తే దాని యథాతధంగా అమలు చేశాయి అప్పటి ప్రభుత్వాలు. అదే తీరు 1998 వరకుసాగింది. ఎప్పుడైతే గొనెల కమిషన్ 20 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని చెబితే.. అందుకు భిన్నంగా 25 శాతం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి సిఫార్సు చేసే దానికి.. ప్రభుత్వాలు ప్రకటించే దానికి పోలికే లేని పరిస్థితి.

తాజాగా కేసీఆర్ సర్కారు ప్రకటించిన 30 శాతం ఫిట్ మెంట్ సంగతే చూస్తే.. 2018 మేలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిషన్ 7.5 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ.. ప్రభుత్వం మాత్రం అంతకు నాలుగింతలు పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. అయితే.. ఇదే విషయానికి ఉద్యోగ సంఘాల వాదన మరోలా ఉంటుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కావాలనే తక్కువ మొత్తాన్ని సిఫార్సు చేసేలా చేసి.. తర్వాత మొత్తాన్ని పెంచుతుందని చెబుతారు. చూసినోళ్లకు భారీగా పెంచినట్లు ఉంటుంది కానీ.. తమకు వచ్చేదేమీ ఉండదని చెబుుతారు. కానీ.. పెరిగిన జీతాలు.. ప్రైవేటు రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు వస్తున్న జీతాల్ని పోలిక చూస్తే.. ఉద్యోగ సంఘాల వారు చెబుతున్న మాటల్ని పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదన్న భావన కలుగక మానదు.

ఇక.. 1998 నుంచి 2018నాటి వరకు మొత్తం ఐదు కమిషన్లుఏర్పాటు చేస్తే.. ఈ ఐదు సందర్భాల్లోనూ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఫిట్ మెంట్ కు మించి భారీగా ఇచ్చేయటం చూస్తే.. పన్నులు కట్టే జీవి బిక్కముఖం వేయాల్సిందే.

ఏడాది      కమిషన్  పేరు        సిఫార్సు చేసిన శాతం       ప్రభుత్వం ఇచ్చింది
1998         ఆర్ఎం గోనెల                20                               25
2004         జె.రాంబాబు                 10                               16
2008         సి.ఎస్.రావు                 27                              39
2013           పి.కె. అగర్వాల్            27                              43
2018           సి.ఆర్.బిశ్వాల్             7.5                             30
Tags:    

Similar News