డామిట్ తేడా కొడుతుందే.. గులాబీ నేతల్లో కొత్త అంతర్మధనం

Update: 2021-11-11 10:30 GMT
తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ అధినేతల్లో వాక్ చాతుర్యం ఉన్న నేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. తన మాటలతో మంత్రించినట్లుగా చేయటం ఆయనకున్న ప్రత్యేక లక్షణం. అదే ఆయన్ను మిగిలిన వారిని భిన్నంగా నిలుపుతుంటుంది. తెలుగు.. ఇంగ్లిష్.. హిందీ.. అవసరమైతే సంస్కృతంలో శ్లోకాలు చెప్పి మనసుల్నిదోచేయటమే కాదు.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా.. సూటిగా.. మనసుకు హత్తుకునేలా చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి.

ఏమాటకు ఆ మాట చెప్పాలి.. దశాబ్దాల తరబడి నెరవేరని ప్రత్యేక తెలంగాణ కల సాకారమైందంటే.. అది కేసీఆర్ మాటలకున్న శక్తి సామర్థ్యాలు కూడా అన్నది మర్చిపోకూడదు. ఉద్యమ నాయకుడిగా.. ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అవతరించిన ఆయన.. పరిస్థితుల్ని తన చెప్పు చేతల్లో ఉంచుకునే విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ ధీమానే ఆయన్ను ప్రజలకు దూరం చేసిందన్న విమర్శ కూడా వినిపిస్తూ ఉంటుంది. తాను అనుకోవాలే కానీ.. ఎలాంటి సీన్ అయినా ఇట్టే మార్చేసే సత్తా తన సొంతమని ఫీలయ్యే కేసీఆర్.. తనదైన ప్రపంచంలో మాత్రమే ఉంటారని.. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరిస్తారని చెబుతారు.

దేశంలోని ముఖ్యమంత్రులంతా సచివాలయానికి రావటం.. సమావేశాల్ని నిర్వహించటం చేస్తుంటారు. కేసీఆర్ మాత్రం సచివాలయానికి రాకపోవటమే కాదు..ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సచివాలయం అన్నట్లుగా మాట్లాడిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇలా తనదైన వాదనను బలంగా వినిపించే మాటల శక్తి ఈ మధ్య కాలంలో మందగించిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.హుజూరాబాద్ ఉప ఎన్నికలో పరాజయం తర్వాత పార్టీ పరపతి.. కేసీఆర్ ఇమేజ్ కు భారీ డ్యామేజ్ జరిగిందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ఫలితం వెలువడిన నాలుగురోజుల తర్వాత మీడియా ముందుకు రావటం తెలిసిందే.

వచ్చి రాగానే.. తానిక డైలీ బేసిస్ లో మీడియాతో మాట్లాడతానని.. తానే రంగంలోకి దిగుతున్నట్లుగా చెప్పి.. తెలంగాణ బీజేపీ బాధ్యుడు బండి సంజయ్ తో పాటు.. కేంద్రంలోని మోడీ సర్కారు పైనా ఘాటు విమర్శలు చేశారు. మోడీ.. అమిత్ షా పేర్లను ప్రస్తావించకుండా బీజేపీ విధానాల్ని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఇంతలా మాట్లాడిన తర్వాత.. మామూలుగా అయితే కేసీఆర్ మాటల ప్రభావం తెలంగాణ సమాజం మీద ఉండటమే కాదు.. వాతావరణంలో మార్పు వచ్చేది. టీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ తమ గళాన్ని విప్పేవారు. సోషల్ మీడియాలో గులాబీ దళం చెలరేగిపోయేది.ఆ పార్టీ మద్దతుదారులు.. సానుభూతి పరులు తమ బిగ్ బాస్ చెప్పిన మాటలకు మరికొంత చేర్చి తమ వాదనను బలంగా వినిపించేవారు.

కానీ.. తాజాగా మాత్రం అలాంటి సీన్ లేకపోవటం గులాబీదళంలో కొత్త గుబులుకు కారణమవుతుందని చెబుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే.. అప్పటివరకు ఉన్న వాతావరణంలో కాస్త మార్పు రావటమే కాదు..ఆయన ప్రత్యర్థులు మాట్లాడటానికి.. తిరిగి సమాధానం చెప్పటానికి తటపటాయించేవారు. కేసీఆర్ నోటికి భయపడేవారు.కానీ.. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు అంతే ఘాటుగా రియాక్టు అవుతున్న తీరు టీఆర్ఎస్ శ్రేణులకు కొత్త అనుభవాన్ని ఇస్తోంది. దీనికి తోడు.. గతంలో మాదిరి.. అధినేత మీడియాతో మాట్లాడిన తర్వాత.. అప్పటివరకు ఉన్న వాదనలు డివైడ్ అయ్యేవి. కానీ.. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవటం.. ఆ ఫీడ్ బ్యాక్ ప్రగతిభవన్ వర్గాలకు సైతం షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న సత్యాన్ని మర్చిపోతే ఇలాంటి సమస్యలు తప్పవు.


Tags:    

Similar News