దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై హైదరాబాదీల సందడి

Update: 2020-09-15 01:30 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు కొంతకాలంగా పర్యాటక ప్రదేశాలకు, విహార యాత్రలకు ప్రజలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొంతమంది ఔత్సాహికులు జాగ్రత్తలు పాటిస్తూ పర్యాటక ప్రదేశాలకు వెళుతున్నారు. ఇక, ప్రాణాంతక వైరస్ దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్న భాగ్య నగర వాసులు కూడా తాజాగా నగరంలోని అబ్బురపరిచే పర్యాటక ప్రాంతాన్ని ఆదివారం నాడు సందర్శించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ లో రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు నగరవాసులు బారులుతీరారు. ఆదివారం ఆటవిడుపుగా నగరంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతాన్ని వీక్షించేందుకు జంటనగరాల ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు.

ఓ పక్క చిరుజల్లులు....చల్లని వాతావరణం ....ఆదివారం సెలవు రోజు...దీంతో, చాలాకాలం నుంచి ఇళ్లలోనే లాక్ అయిపోయిన నగర వాసులు కాస్త సేదతీరేందుకు అడుగు బయటపెట్టారు. ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. సెప్టెంబరు 18న ప్రారంభం కానుందని అనధికారిక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత వాహనాలను ఈ బ్రిడ్జిపై అనుమతించే అవకాశముందని తెలుస్తోంది. అందుకే, ఖాళీగా ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రకృతి అందాలను తిలకిస్తూ సెల్ఫీలు దిగేందుకు నగరవాసులు పోటీపడ్డారు. రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై పాదచారులు, సైక్లింగ్ చేేసేవారికోసం ప్రత్యేక మార్గం ఉంది.ఇక, రాత్రిపూట నగరవాసులను కనువిందు చేసేందుకు ఈ బ్రిడ్జికి విద్యుత్ కాంతులతో అదనపు హంగులను అద్దింది జీహెచ్ ఎంసీ. అయితే, సెప్టెంబరు 18న ఈ బ్రిడ్జి ప్రారంభించబోతున్నామని ఇటు ప్రభుత్వం, అటు జీహెచ్ ఎంసీల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Tags:    

Similar News