ఇదో మాఫియా..హైద‌రాబాద్‌ కే ప్ర‌త్యేకం

Update: 2018-05-22 04:29 GMT
హైద‌రాబాదీ అక్ర‌మార్కుల తెలివి మీరిపోతోంది. కొత్త కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో పోలీసుల‌కే చుక్క‌లు చూపిస్తున్నారు. అలా దేశంలోనే మ‌రెక్క‌డా లేని స‌రికొత్త స్కాంకు తెర‌తీయ‌గా పోలీసులు దాన్ని భగ్నం  చేశారు. ఇలాంటి స్కాంను చూసి పోలీసులు సైతం షాక్ తిన‌డం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకి వెళితే...అబిడ్స్‌ లోని తాజ్ హోటల్ సమీపంలోని ఎస్‌ బీఐ ఏటీఎం ప్రక్కన ఫుట్‌ పాత్‌ పై సయ్యద్ ఫయాజ్ సెల్‌ ఫోన్ల విక్రయం చేస్తున్నాడు. పాదచారులు నడిచే ఫుట్‌ పాత్‌ ను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తుండడంతో ఫుట్‌ పాత్ ఆక్రమణల తొలిగింపులో భాగంగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు సయ్యద్‌ కు చెందిన డబ్బాను తొలిగించి - స్టేషన్‌ కు తరలించారు.

అయితే ఇక్క‌డే ట్విస్ట్ చోటుచేసుకుంది. స్టేషన్‌ కు వెళ్లగానే సయ్యద్ ఏడుస్తూ ``సారూ.. నేను నెలకు రూ. 18 వేల కిరాయి ఇస్తున్నాను. నా డబ్బాను ఎందుకు తొలిగించారు?` అంటూ పోలీసులను ప్ర‌శ్నించాడు. దీంతో షాక్ తిన‌డం పోలీసుల వంత‌యింది. ``నెలకు రూ. 18 వేల కిరాయా..? ఎవరు తీసుకుంటున్నారు?` అని ప్రశ్నించడంతో ఫయాజయ్ - ఉస్మాన్ - ప్రేమ్ చంద్రారెడ్డి అనే వ్యక్తులు ఆ ప్రాంతంలో నెలవారి అద్దె వసూలు చేస్తున్నారని చెప్పడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై శాంతి భద్రతల పోలీస్‌ స్టేషన్‌ లో పిర్యాదు చేశారు. ఫుట్‌ పాత్‌ లను అక్రమించి.. ఆ స్థలాన్ని అమాయకులకు అద్దెకిస్తూ బలవంతంపు వసూళ్లకు పాల్పడుతున్నారని గుర్తించిన అబిడ్స్ పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో గల్లీ లీడర్.. తనకున్న స్థానిక పలుకుబడి, పరిచయాలతో అక్కడ రౌడీయిజం చేస్తున్నారు. దీంతో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కరు సామంత రాజులుగా ఏలుతున్నారు. వాస్తవంగా జీవనోపాధి కోసం ఫుట్‌ పాత్ వ్యాపారం చేసే వారికి జాగనివ్వడం లేదు. స్థానికంగా ఉండే వారి కనుసన్నల్లోనే ఈ వ్యాపారాలను నిర్వహించే విధంగా చిరు వ్యాపారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్ ఆర్‌ నగర్ - దిల్‌ సుఖ్‌ నగర్ - సికింద్రాబాద్ - పంజాగుట్ట ప్రాంతాలలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసి పాదచారులు నడువకుండా ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా అమీర్‌ పేట్ ప్రాంతంలో భారీగా ఫుట్‌ పాత్‌ లపై ఉన్న బోర్డులను ఎస్ ఆర్‌ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫుట్‌ పాత్ బండ్లు - బోర్డులను గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నారు. కేసుల భయంతో కొందరు పోలీసులు స్వాధీనం చేసుకున్న బండ్లను విడిపించుకోవడానికి ముందుకు రావడం లేదు.
Tags:    

Similar News