పది పాసయ్యారు..డాక్టర్లు అయ్యారు : ఎలా అంటే ?

Update: 2020-07-20 13:30 GMT
వాళ్లు చదివింది మాత్రం పదే. కానీ, చేసేది మాత్రం డాక్టర్‌ వృత్తి. కరోనా నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఫేక్ డాక్టర్స్ ను రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ ఇద్దరు ప్రబుద్దులు నకిలీ ఆసుపత్రి పెట్టి రెండున్నర ఏళ్లుగా రోగుల నుంచి లక్షల్లో దండుకున్నారు. ఫార్మసీలో జరిగిన చిన్న వ్యవహారంతో అసలు వ్యవహారం బయటకి వచ్చింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... హైదరాబాద్ కి చెందిన మహ్మద్ అబ్దుల్ ముజీబ్, మహ్మద్ సోహెబ్ సుభానీలు 10వ తరగతి వరకు చదివారు. కానీ, వైద్య విద్యను అభ్యసించామంటూ నకిలీ పత్రాలు సృష్టించి ఆసుపత్రి పెట్టుకోవడానికి అనుమతి పొందారు. సుభానీ చైర్మన్ ‌గా, ముజీబ్ ఎండీగా మారి ఆసిఫ్‌ నగర్-మెహదీపట్నం రహదారిపై ప్రైవేటు ఆసుపత్రిని ఓపెన్ చేసారు. దాదాపు మూడేళ్లుగా అక్కడ ఆ హాస్పిటల్ రన్ అవుతుంది. నిజమైన డాక్టర్స్ అని నమ్మిన ప్రజలు వెళ్తున్నారు.. వస్తున్నారు. తాజాగా ఆ హాస్పిటల్ లో ఐసొలేషన్ వార్డులు ఏర్పాటుచేసి కరోనా ట్రీట్ మెంట్ కూడా ప్రారంభించారు. కరోనా ట్రీట్మెంట్ అంటూ ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేసి రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఆ సమయంలో కరోనాకు చెందిన ఇంజెక్షన్లను వాళ్ల ఫార్మసీలో అధిక ధరలకు విక్రయించడం మొదలు పెట్టారు. దీంతో ఒక బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఆసుపత్రిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. కరోనాకు సంబంధించి 10 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొని ఏడుగురిని అరెస్టు చేశారు. అలాగే , ఆ హాస్పిటల్ లోని వైద్యుల సర్టిఫికెట్లను తనిఖీ చేయగా అసలు మోసం బయటపడింది. అసలు వీళ్లు డాక్టర్లే కాదని తేలింది. హాస్పిటల్ పెట్టిన అబ్దుల్ ముజీబ్, సోహెబ్ సుభానీలు కేవలం పదో తరగతి మాత్రమే పాసయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది.
Tags:    

Similar News