సిద్దరామయ్యను పార్టీ నుంచి గెంటేశారట!

Update: 2019-05-12 09:33 GMT
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ఒకప్పటి జేడీఎస్ నేత అన్న విషయం అందరికీ తెలుసు. ఆ పార్టీలో చక్రం తిప్పిన మీరు కాంగ్రెస్‌ లో ఎందుకు చేరినట్టో- అంటూ బీజేపీ నేతలు సిద్దరామయ్యను ప్రశ్నించారట. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన సిద్దరామయ్య తాను కాంగ్రెస్‌ లో ఎలా చేరిందీ ఏకరవు పెట్టారు.

తానేమీ కావాలని జేడీఎస్‌ ను విడిచిపెట్టలేదని - మాజీ ప్రధాని - జేడీఎస్ అధినేత హెచ్‌‌ డీ దేవెగౌడ పార్టీ నుంచి తనను బహిష్కరించారంటూ ఫ్లాష్‌ బ్యాక్‌ ను పూసగుచ్చినట్టు చెప్పారు. తనను విమర్శించే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని - తొందరపడి నోరుజారొద్దని కూడా బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. జేడీఎస్ నుంచి తానెందుకు బయటకు వచ్చిందో బీజేపీ నేతలు తొలుత తెలుసుకోవాలన్న సిద్దరామయ్య- తాను కర్ణాటకలోని మైనారిటీలు - వెనకబడి కులాలు - దళితులకు సంబంధించిన (అహింద్) కార్యకలాపాల్లో పాల్గొంటున్నానని ఆరోపిస్తూ దేవెగౌడ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వివరించారు. తన మాటలు ఇప్పటికైనా బీజేపీ నేతలు విశ్వసించాలని సిద్దరామయ్య అన్నారు. బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టే తొందరలో తనను పార్టీ నుంచి గెంటేసిన విషయం బయట పెట్టేసి ప్రతిపక్షాలకు మరో అస్త్రాన్ని ఇచ్చేశారు సిద్దరామయ్య.


Tags:    

Similar News