జూ.ఎన్టీఆర్‌ తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపడితే..?

Update: 2019-03-04 07:36 GMT
తెలంగాణలో కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకున్న టీడీపీ తాజాగా ఒక స్థానాన్ని కోల్పోయింది. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ ఎస్‌ లో చేరడంతో టీడీపీ నుంచి ఒక్కే ఒక్క ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌ రావు మిగిలారు. ఆయన కూడా గులాబీ కండు కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఆయితే ఒక్కడినైనా టీడీపీలోనే ఉంటానని పార్టీని కాపాడుతానని తెగేసి చెప్పారు. దీంతో ఆయనపై పార్టీ అధినేతకు కాస్త నమ్మకం కలిగినట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలో తెలంగాణలో టీడీపీ పునర్వైభవాన్ని తీసుకురావడమెలా..? అని చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ   పగ్గాలు జూనియర్‌ ఎన్టీఆర్‌ చేపడితే కచ్చితంగా పాతరోజులు వస్తాయని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ టీడీపీ  తరుపున ప్రచారం చేశారు. గత డిసెంబర్‌ లో తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని అందరూ భావించారు. కానీ రాలేకపోయారు.

ఆ సమయంలో కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్‌ సోదరి సుహాసినికి టికెట్‌ కేటాయించడంతో మరోసారి ఎన్టీఆర్‌ పేరు తెరపైకి వచ్చింది. సోదరి కోసం కచ్చితంగా జూనియర్‌ తెలంగాణలో ప్రచారం చేస్తారని అనుకున్నారు. అయితే అదీ సాధ్యం కాలేదు. ఏదేమైనా ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో తెలంగాణపై బాబు ప్రస్తుతానికి దృష్టి సారించడం లేదు.

త్వరలో ఏపీలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మరోసారి అధికారంలోకి వస్తే లోకేశ్‌ ను తెరపైకి తీసుకొచ్చే ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించే పనిలో ఉన్న ఆయన త్వరలో జాతీయ రాజకీయాలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కు తెలంగాణ పగ్గాలు చేపడితే పార్టీకి మంచిరోజులు వస్తాయని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు.

గత ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కు తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ ఎన్నికల సమయంలో ఇలాంటివి మాట్లాడొద్దని బాబు చురక వేశారు. దీంతో అప్పుడు కామ్‌ అయిన తెలుగు తమ్ముళ్లు పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ డిమాండ్‌ ను తెరపైకి తెస్తున్నారు. మరి బాబు ఏ విధంగా స్పందిస్తాడోననే ఆసక్తి ఇరు రాష్ట్రాల్లోని పార్టీ నాయకుల్లో ఉంది.
Tags:    

Similar News