జగన్‌ ప్రభుత్వం ఆ మార్గదర్శకాలు తెస్తే టీడీపీకి చిక్కులేనా?

Update: 2022-12-30 05:01 GMT
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమం తీవ్ర విషాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట జరిగి 8 మంది మరణించిన ఉదంతం అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీసింది.

చంద్రబాబు ప్రచార పిచ్చి వల్లే గతంలో గోదావరి పుష్కరాల సమయంలోనూ, ఇప్పుడు కందుకూరులోనూ అమాయకులు బలయ్యారని వైసీపీ నేతలు ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. మరోవైపు జగన్‌ ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, భారీగా ప్రజలు హాజరైనా వారిని నియంత్రించే చర్యలు చేపట్టలేదని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

కాగా కందుకూరు ఉదంతాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే రకమైన సంకేతాలు ఇవ్వడం గమనార్హం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ విషయంలో పోలీసులు, సంబంధిత ప్రభుత్వ శాఖలు తప్పకుండా చర్యలు చేపడతాయని పేర్కొన్నారు. పలువురు వైసీపీ నేతలు సైతం ఇదే రకంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

దీన్ని బట్టి రానున్న రోజుల్లో టీడీపీ నిర్వహించే కార్యక్రమాల విషయంలో జగన్‌ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు తేనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరుకు సందుల్లో సభలు నిర్వహించకుండా చూడటం, ఎంతమంది హాజరవుతారో ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ సంఖ్యను మించితే శాంతిభద్రతలను సాకుగా చూపి సభలకు అనుమతులు ఉపసంహరించడం వంటివి చేయనుందని చెబుతున్నారు.

వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్‌ సైతం ఇలా పొడవుగా, అత్యంత ఇరుకుగా ఉన్న సందుల్లోనే సభలు నిర్వహించారు. ఇలాంటి ఇరుకు సందుల్లో సభలు నిర్వహించడం వల్లే వందల్లోనే ప్రజలు వచ్చినా వేలాది మంది తరలివచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షా అన్నట్టు చంద్రబాబు సైతం జగన్‌ లాగే ఇరుకు సందులను సభలకు ఎన్నుకుంటున్నారు.

ఆ సభల ఫొటోలను సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ చేస్తున్నారు. వైసీపీ సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పంథాను అనుసరించింది. ఈ ప్రయోగం వైసీపీకి మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్ల వేలాది మంది హాజరైనట్టు కనిపించింది. దీంతో ప్రజల మద్దతు తమకే ఉందని.. అందుకే తమ సభలకు వేలాది మంది హాజరవుతున్నారని చెప్పుకుంది.

ఇప్పుడు అచ్చం వైసీపీ అధినేత జగన్‌ రూటులోనే చంద్రబాబు సైతం తన సభలకు ఇరుకు సందులను ఎంచుకుంటున్నారు. ఈ సభలకు ప్రజలు కూడా భారీగానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేసేది ఏమిటో తనకు తెలుసు కనుక వైసీపీ జాగ్రత్తపడుతోంది. దానికి కందుకూరు ఉదంతం కలసి వస్తోంది. ఈ ఘటనను సాకుగా చూపి.. ఇరుకు సందుల్లో సభలు పెట్టకుండా మార్గదర్శకాలను జగన్‌ ప్రభుత్వం ఖచ్చితంగా తెచ్చే అవకాశం ఉంది.

దీంతో చంద్రబాబు ఇప్పటిమాదిరిగా ఇరుకు సందుల్లో సభలు నిర్వహించడం కుదరదు. పెద్ద మైదానాల్లో మాత్రమే సభల నిర్వహణకు అవకాశమిస్తే అంత నిండుగా జనాలను రప్పించడం కష్టమే. జనాలు రాకపోతే చంద్రబాబు సభ వెలవెల పోయిందని వైసీపీ ప్రచారం చేసే వీలుంది.

మరోవైపు జనవరి 27 నుంచి నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో పాదయాత్రను నియంత్రించేలా కూడా జగన్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు ఉంటాయని చర్చ  జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News