ఆ వైసీపీ నేత తీరు మార‌క‌పోతే తిప్ప‌లేనా?

Update: 2019-10-07 14:30 GMT
కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి. వైసీపీలో కీల‌క నాయ‌కుడు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో త‌న వాయిస్‌ను బ‌లంగా వినిపించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌దునైన విమ‌ర్శ‌లు సంధించి ప్ర‌తిప‌క్షంతో ఓ ఆట ఆడుకు న్నారు. నెల్లూరు జిల్లా సర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు వ‌రుస విజ‌యాలు సాధించిన కాకాణి.. నియోజ‌కవ‌ర్గం స‌హా జిల్లాపై ప‌ట్టు సాధించారు. వైసీపీ జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ఆయ‌న వివాదాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. గ‌తంలో వైఎస్ ఉన్న‌ప్పుడు జ‌డ్పీ చైర్మ‌న్‌గా కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న జ‌గ‌న్ బాట బ‌ట్టి వైసీపీలో చేరి స‌ర్వేప‌ల్లిలో పోటీ చేసి రెండు సార్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిని ఓడించారు.

ఈ ఎన్నికల్లో వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గంలో చోటు సంపాయించాల‌ని భావించిన కాకాణికి ఎదురు దెబ్బ‌త‌గిలింది. దీంతో ఆయ‌న‌కు మంత్రి కావాల‌న్న కోరిక తీర‌లేదు. అయితే, వ‌చ్చే రెండున్న‌రేళ్ల త‌ర్వాత త‌న పేరును ప‌రిశీలించేందుకు అవ‌కాశం ఉన్న విష‌యం తెలిసి కూడా ఆయ‌న మాత్రం ఇప్ప‌టి నుంచే త‌న‌కు అను కూలంగా ప‌రిస్థితిని మార్చుకోవాల్సింది.. పోయి.. సొంత పార్టీలోనే ప్ర‌త్య‌ర్థుల‌ను త‌యారు చేసుకున్నారు. త‌న‌క‌న్నా సీనియ‌ర్లు ఉన్నందుకు త‌న‌కు మంత్రి వ‌ర్గంలో సీటు ల‌భిస్తుందో లేదోన‌ని బావిస్తున్న కాకాణి.. ఆ సీనియ‌ర్ల‌కు పొగ‌పెట్ట‌డం ప్రారంభించారు. అంటే.. సద‌రు వైసీపీ సీనియ‌ర్ నేత‌ల‌ను బ‌ద్నాం అయ్యేలా తెర‌చాటు కార్య‌క్ర‌మానికి పురిగొల్పార‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై తీవ్రంగా ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిపై ఎంపీడీవో ఫిర్యాదు వెనుక కాకాణి ఉన్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇక‌, మంత్రి అనిల్ కుమార్‌తోనూ కాకాణి క‌లుపుకొని పోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్య‌క్షుడు కూడా కావ‌డంతో ఆయ‌న మాట‌కు తిరుగులేద‌ని అనుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే, ఇప్పుడు సీనియ‌ర్ నాయ‌కుల‌ను దూరం చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాని మంత్రి ప‌ద‌వి కోసం.. వ‌చ్చే అవ‌కాశం కూడా దూరం చేసుకుంటున్నారు. అయితే, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. కాకాణి.. మాజీ మంత్రి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో చెలిమి చేస్తున్నారు. అయితే, ఈయ‌న కూడా మంత్రి ప‌ద‌విని ఆశించి భంగ ప‌డిన నాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం.

కాకాణి తీరు మార‌క‌పోతే జిల్లాలో పార్టీకి తిప్ప‌లు త‌ప్పేలా లేవు. ఇక కాకాణికి రిజ‌ర్వ్ కానెస్టెన్సీ ఎమ్మెల్యేల‌తో పెద్ద‌గా స‌ఖ్య‌త లేదు. ఇక మ‌రో మంత్రి గౌతంరెడ్డి ఎవ్వ‌రిని ప‌ట్టించుకోకుండా త‌న దారిలో తాను వెళుతున్నారు. ఏదేమైనా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అది కూడా జ‌గ‌న్‌తో అత్యంత స‌న్నిహితంగా ఉంటోన్న ఎమ్మెల్యేను టార్గెట్ చేయ‌డం ద్వారా కాకాణి సొంత పార్టీలోనే స‌రికొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యారు.
Tags:    

Similar News