ఐసిస్‌కు వ్య‌తిరేకంగా ముస్లిం గురువుల పోరు

Update: 2016-07-16 07:07 GMT
ముస్లిం యువతను తీవ్రవాదం వైపు మొగ్గుచూపేలా చేయడానికి ఐఎస్‌ఐఎస్, ఇతర ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమాల‌ను విస్తృతంగా ఉపయోగించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ముస్లిం మతంపై పెద్ద ఎత్తున చెడు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ద్వారా సామాన్య ముస్లింల‌కు కూడా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా కేంద్రంగానే ఉగ్ర‌వాదం వైపు ముస్లిం యువ‌త వెళ్ల‌కుండా చూసేందుకు ముస్లిం మ‌త‌గురువు ఒక‌రు ముందుకు వ‌చ్చారు.

బెంగాల్‌ లో సీనియర్ మతగురువైన ఫజ్లుర్ రెహమాన్ ఇందుకు నడుం బిగించారు. యువత ఐఎస్‌ ఐఎస్ - ఇతర ఉగ్రవాద ముఠాల వైపు ఆకర్షితులు కాకుండా అడ్డుకోవడం కోసం సామాజిక మాధ్యమం ద్వారా శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆయ‌న యోచిస్తున్నారు. త‌ద్వారా ఇస్లాం అంటే నిజమైన అర్థం ఏమిటో వారికి తెలిసేలా చేయాలని భావిస్తున్న‌ట్లు బెంగాల్‌ కు చెందిన ఈ ముస్లిం మత గురువు తెలిపారు. ఐసిస్ - ఇతర ఉగ్రవాద సంస్థలు ఇస్లాం - ఖురాన్‌ లోని బోధనలను వక్రీకరించడం ద్వారా యువతను తప్పు దోవ పట్టిస్తున్నాయని ఆయన అంటూ - దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరముందన్నారు. సామాజిక మాధ్యమం ఎక్కువ మందికి చేరువ అవుతున్నందున సామాజిక మాధ్యమం ద్వారా ఇస్లాం నిజంగా ఏమి చెబుతోందో జనానికి తెలియజేయాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్ర‌చార వ్యూహం ఖరారు చేయలేదని, ఈ అంశంపై తాను పలువురు ముస్లిం మతగురువులు - ఇస్లాం పండితులతో చర్చలు జరుపుతున్నట్లు రెహమాన్ చెప్పారు. ప్రచార వ్యూహం ఖరారయిన తర్వాత అరబిక్ - ఉర్దూ - బెంగాలీ - హిందీ - ఇంగ్లీషు భాషలను ఈ ప్రచారం కోసం ఉపయోగిస్తామని రెహమాన్ చెప్పారు.
Tags:    

Similar News