ఈ అప్ డేట్స్ చాలా అవసరం బాస్

Update: 2015-11-16 04:21 GMT
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు వ్యక్తిగతంగా ప్రభావం చూపించటం ఖాయం. ప్రస్తుత వ్యవస్థలో సమాచారం వెల్లువలా వచ్చి పడుతున్న నేపథ్యంలో అతి ముఖ్యమైనవి.. వ్యక్తిగతంగా.. ఆర్థికంగా ప్రభావితం చేస అంశాలతో పాటు.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రోజువారీ జీవితాన్ని ఎంతోకొంత ప్రభావితం చేస్తుంటాయి. అలాంటి కొన్ని ముఖ్యమైన.. ఆసక్తికర అంశాలు చూస్తే..

= ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మారిషస్ నుంచి హైదరాబాద్ కు తెచ్చిన పోలీసులు ఆయన్ను కడపకు తరలించారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపర్చగా.. గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. గంగిరెడ్డిని జైలుకు తరలించారు.

= దేశంలో తరుగుతున్న నిల్వలలతో పాటు.. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా రానున్న రోజుల్లో నిత్యవసర వస్తువు అయిన బియ్యం ధరలకు రెక్కలు వచ్చేఅవకాశం ఉందని.. ఈ విషయంపై ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాలని పారిశ్రామిక సంస్థ అసోచాం అంచనా వేసింది. రుతుపవనాలు సరిగా లేకపోవటం.. దేశ వ్యాప్తంగా పంటలు సరిగా వేయకపోవటం లాంటి కారణాలతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందని.. దీని నివారణ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకాలం పప్పుధాన్యాలు.. నూనెల మీద ధరల ప్రభావం పడితే.. రానున్న రోజుల్లో బియ్యం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉందని తేల్చింది.

= ప్రధాని మోడీ మానసపుత్రిక అయిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నిధులు సమకూర్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకూ ఉన్న సేవాపన్నును మార్చటం తెలిసిందే. తాజాగా సేవాపన్ను విధించే దానికి మరో 0.5శాతం అదనంగా విధించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పన్ను విదించేందుకు అర్హత ఉన్న అన్ని రకాల సేవలపైనా ఇప్పటివరకూ ఉన్న 14 శాతం సేవాపన్ను స్థానే.. 14.5శాతం పన్నును వసూలు చేస్తారు. ఈ కారణంగా ఏటా రూ.10వేల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

= డిమాండ్ పెరగటం.. మొన్నటి వరకూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలు మొత్తంగా టమోటా ధర మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. టమోటా మార్కెట్ కు గుండెకాయ లాంటి చిత్తూరు జిల్లా మదనపల్లెలో కేజీ టమోటా తాజాగా రూ.90 టచ్ కావటం గమనార్హం. ఇదే మార్కెట్లో కేజీ 50 పైసలు కూడా పలక్క రైతులు తమ పంటను రోడ్ల మీద పడేయటం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు కేజీ రూ.90 మదనపల్లి మార్కెట్లో పలికిన నేపథ్యంలో.. బహిరంగ మార్కెట్లో టమోటా ధర చుక్కలకు అంటటం ఖాయంగా చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో కేజీ టమోటా రూ.51.. చిల్లరగా రూ.70 వరకు అమ్ముతున్నారు. మదనపల్లి మార్కెట్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో దీని ధర మరింత భారీగా పెరగటం ఖాయమంటున్నారు.

= మహాత్మగాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేపై ఒక వెబ్ సైట్ ను తాజాగా ఓపెన్ చేశారు. గాడ్సేను ఉరి తీసిన నవంబరు 15 పురస్కరించుకొని ఈ సైట్ ను ఓపెన్ చేశారు. గాంధీ హత్య వెనుకున్న నిజాలు.. గాడ్సే భావాల్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ అఖిల భారత హిందూమహాసభ.. విశ్వహిందూ పీఠ్ ఐటీ విభాగం ఈ వెబ్ సైట్ ను స్టార్ట్ చేశాయి.www.nathuramgodse.in పేరిట సైట్ ను తెరిచారు.
Tags:    

Similar News