అఫ్గాన్ చరిత్రలో అసాధ్యమైన పనిని చేసిన ఆమె దేశాన్ని విడిచి వెళ్లింది

Update: 2021-08-31 03:40 GMT
అఫ్గాన్ చరిత్రలో ఎవరూ చేయలేని పనిని ఆమె చేసింది. నరరూప రాక్షసుల మాదిరి వ్యవహరిస్తూ.. ప్రాణాలు తీయటమంటే పబ్జీ గేమ్ ఆడినంత సులువుగా వ్యవహరించే తాలిబన్లతో పెట్టుకోవటమంటే మామూలు విషయం కాదు. అందునా.. మహిళలు అన్న వారెప్పుడూ పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా.. సెక్సు బానిసలుగా.. వారిని మనుషుల కింద చూసేందుకు ఇష్టపడని తాలిబన్లను ఇంటర్వ్యూ చేయటం అంటే మామూలు విషయం కాదు.

అఫ్గానిస్థాన్ చరిత్రలో తాలిబన్ ప్రతినిధి ఒకరిని ఒక మహిళా జర్నలిస్టు ఇంటర్వ్యూ చేయటం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నట్లే. అయినప్పటికీ.. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మొదలు పెట్టాలన్నట్లుగా మొండిధైర్యం.. అంతకు మించిన సాహసంతో ఒక మహిళా జర్నలిస్టు ఇంటర్వ్యూ చేశారు. ఆమె.. 24 ఏళ్ల బెహెస్తా అర్ఘాంద్. అఫ్గాన్ ను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆగస్టు 17న తాలిబన్  ప్రతినిధిని ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఇది కాస్తా ఆమెను ప్రపంచానికి సుపరిచితం చేసింది.

తమను తాము మంచివాళ్లుగా చూపించుకోవటానికి తాలిబన్లు ఈ ఇంటర్వ్యూను వాడుకున్నారు. వారెంత మారారన్నది ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రపంచానికి అర్థమైంది. అయితే.. తాలిబన్ ను ఇంటర్వ్యూ చేసిన బెహెస్తా అర్ఘాంద్ ప్రాణభయంతో ఆమె అఫ్గాన్ ను విడిచి పెట్టి పారిపోయారు. ఎందుకిలా? దీనికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. తాలిబన్ అన్న మాటే వస్తుంది. తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసిన ఆమె.. తర్వాత వారి చేతుల్లో గాయపడిన మలాలా యూసఫ్ జాయ్ ను కూడా ఇంటర్వ్యూ చేశారు.

అదే ఆమెను కష్టాల్లోకి నెట్టింది. కొత్తగా ప్రాణభయం అనేది వెంటాడటం మొదలు పెట్టింది. ఆమె పని చేస్తున్న ‘టోలో న్యూస్’ కు మలాలా మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓవైపు తాలిబన్ ప్రతినిధిని.. మరోవైపు వారి చేతిలో  తీవ్రంగా గాయపడి.. ప్రపంచం మొత్తానికి సుపరిచితురాలిగా మారిన ఆమెను ఇంటర్వ్యూ చేయటం ద్వారా.. ప్రాణాల మీదకు ముప్పు తెచ్చుకున్నట్లైంది. దీంతో.. అఫ్గాన్ ను వదిలిపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీంతో.. ఆఫీసుకు వెళ్లటం మానేసిన ఆమె.. ఒక ఎన్జీవో ద్వారా ఆఫ్గాన్ నుంచి క్షేమంగా బయటపడ్డారు.

లక్షలాది మంది అఫ్గాన్ ప్రజల మాదిరే తాను కూడా తన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. తాలిబన్లకు తాను భయపడుతున్నానని చెప్పిన ఆమె.. ఒక మీడియా సంస్థకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఇక.. బెహెస్తా అర్ఘాంద్ విషయానికి వస్తే తొమ్మిదో తరగతిలో టీచర్ ప్రోత్సాహంతో క్లాస్ రూంలో వార్తలు చదవటం ద్వారా జర్నలిజం మీద ఆసక్తి ఆమెలో మొదలైంది. అది కాస్తా ఆమెను కాబూల్ వర్సిటీ నుంచి జర్నలిజం పట్టా తీసుకునే వరకు తీసుకెళ్లింది. పలు న్యూస్ ఏజెన్సీలు.. రేడియోల్లో పని చేసిన ఆమె.. అఫ్గాన్ లో ప్రఖ్యాత చానల్ అయితే టొలో న్యూస్ లో చేరారు. ఆమె ఆ చానల్ లో చేరిన ఇరవై రోజుల్లోనే అఫ్గాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు.

తాలిబన్లు తమను తాము మారిన మనుషులుగా చూపించుకోవటం కోసం టొలో న్యూస్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసే మహత్తర అవకాశం ఆమెకు దక్కింది. ఆ ఇంటర్వ్యూతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితంగా మారారు. తాలిబన్లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే పరిస్థితులు కచ్ఛితంగా మెరుగుపడతాయని.. తాను సేఫ్ అన్న భావన కలిగిన వెంటనే అఫ్గాన్ కు తిరిగి వస్తానని ఆమె చెబుతున్నారు. ఖతార్ వాయుసేన విమానంలో వెళ్లిపోయిన ఆమె.. తాను తాలిబన్ తో ఇంటర్వ్యూ చేసే సమయంలో తన మనసులోని భావోద్వేగాన్ని బయటపెట్టారు.

‘నిజమే.. వారితో ఇంటర్వ్యూ ప్రాణాంతకమే. అఫ్గాన్ మహిళల కోసమే ధైర్యం చేశా. ఎవరో ఒకరు కచ్ఛితంగా మొదలు పెట్టాల్సిందే. అలా కాకుండా ఇంటి దగ్గరే ఉండిపోతే.. తాలిబన్లు మా మీద నింద మోపుతారు. మహిళలే ఉద్యోగాలు చేయాలనుకోవట్లేదు అని చిత్రీకరిస్తారు. తప్పుడు ప్రచారం సాగుతుంది. అందుకే.. ధైర్యం చేశాను. తాలిబన్ ప్రతినిధికి ఒక విషయాన్ని చెప్పాను. అఫ్గాన్ లో మహిళలకు హక్కులు కావాలని. సమాజంలో తాము కూడా భాగం కావాలని కోరుకున్నా’ అని ఆమె తన ఇంటర్వ్యూ సందర్భంగా జరిగిన విషయాన్ని వెల్లడించారు. బెహెస్తా అర్ఘాంద్ దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.


Tags:    

Similar News