పాక్ ఎన్నిక‌ల ఫైన‌ల్ లెక్క ఇదే..!

Update: 2018-07-27 09:37 GMT
పాకిస్థాన్ జాతీయ ఎన్నిక‌ల ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. బుధ‌వారం ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన వెంట‌నే కౌంటింగ్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.ఓట్ల లెక్కింపు మొద‌టి నుంచి అధిక్యంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కు విజ‌యం సాధించింది. అయితే.. ఇది ప‌రిపూర్ణ‌మైన విజ‌యం కాదు. తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాల్ని చూస్తే.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మేజిక్ ఫిగ‌ర్ ను ఇమ్రాన్ పార్టీ సాధించ‌లేదు.

కాకుంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించిన ఏకైక పార్టీగా అవ‌త‌రించింది. కానీ.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన సంఖ్యా బ‌లం లేని ప‌రిస్థితి. దీంతో.. ఆ పార్టీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకోక త‌ప్ప‌నిస‌రి. పాక్ ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించిన ఫ‌లితాల ప్ర‌కారం పీటీఐ మొత్తం 110 స్థానాల్లో విజ‌యం సాధించింది. మొత్తం 272 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. 251 స్థానాల్లో ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. మిగిలిన చోట్ల ఓట్ల లెక్కింపు ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కు చెందిన పీఎంఎల్ ఎన్ పార్టీ 63 స్థానాల్లో గెలుపొంద‌గా.. బిలావ‌ల్ భుట్టో ఆధ‌ర్వ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 42 స్థానాల్ని ద‌క్కించుకుంది. ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సిన 21 స్థానాల్లో కొన్ని స్థానాలైనా ఇమ్రాన్ పార్టీకి ద‌క్కే వీలుంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన 137 మ్యాజిక్ ఫిగ‌ర్ ను చేరుకోలేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఇమ్రాన్ ఎవ‌రితోనో ఒక‌రితో పొత్తు పెట్టుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇమ్రాన్ కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ప‌లు చిన్న పార్టీలు సిద్ధంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఏర్పాటులో ఆయ‌న స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి.

మ‌రోవైపు పాక్ స్థానిక అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధిక్యంలో దూసుకెళుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన ఫ‌లితాల ప్ర‌కారం ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ‌రో 27 మంది స‌భ్యుల అవ‌స‌రం ఉంది. ఇదిలా ఉంటే.. త‌మ పార్టీ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తుంద‌ని న‌వాజ్ ష‌రీఫ్ సోద‌రుడు షాబాజ్ ష‌రీఫ్ వెల్ల‌డించారు. ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగింద‌న్న పీఎంఎల్ ఎన్ ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు జ‌రిపిస్తామ‌ని ఇమ్రాన్ ఖాన్ వెల్ల‌డించారు. తుది ఫ‌లితాలు వెలువ‌డితే.. ఇమ్రాన్ పార్టీకి వ‌చ్చిన సీట్ల లెక్క‌పై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News