అఫిషియ‌ల్: గులాబీ రంగు ప‌డింది

Update: 2018-12-15 14:32 GMT
ఎన్నికల ప్రక్రియ ముగిసినా టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. హోరాహోరీగా సాగిన‌ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ పోటీచేసిన 119 స్థానాల్లో 88 చోట్ల గెలుపొందింది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌ లో చేర‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుగంటి చందర్‌ రావు కేటీఆర్‌ తో సమావేశమయ్యారు. అనంతరం తాను టీఆర్ ఎస్‌ లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో స్వతంత్ర ఎమ్మెల్యే కూడా టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రాముల్ నాయక్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం తాను కూడా టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

తాజాగా, టీఆర్‌ ఎస్ పార్టీ వర్కింగ్‌  ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే రాములు నాయక్ టీఆర్‌ ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పిన‌ కేటీఆర్ రాములు నాయ‌క్‌ ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ... గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాములు నాయక్ గెలిచిన సంగతి తెలిసిందే.  ఆయ‌న చేరిక అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ 62 ఏళ్ల  యంగ్ టైగ‌ర్‌ రాములు నాయ‌క్ అని అన్నారు. వైరా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని రాములు నాయక్ కోరారు. వైరా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గులాబి జెండాఎగరాలని పిలుపునిచ్చారు.

   

Tags:    

Similar News