ఈ ఏడాది ల‌క్షా 80వేల కొత్త ఐటీ ఉద్యోగాలు

Update: 2017-06-22 16:09 GMT
గ‌త కొద్దికాలంగా దుర్వార్త‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ అన్న‌ట్లుగా మారిపోయిఉన్న దేశీయ ఐటీ రంగం నుంచి పెద్ద తీపిక‌బురు వినిపించింది. భార‌తీయ ఐటీ రంగం వృద్ధి - ఉద్యోగాల క‌ల్ప‌న‌పై దేశీయ ఐటీ ప‌రిశ్ర‌మ‌ వేదిక నాస్కామ్ భారీ సంతోష‌క‌ర‌మైన వార్త వ‌చ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను దేశీయ ఐటీ రంగ వృద్ధిపై నాస్కామ్ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. వచ్చే మార్చి నాటికి ఐటీ రంగంలో 1.50-1.80 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 8-10 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉంద‌ని జోస్యం చెప్పింది. సాధారణంగా ఫిబ్రవరిలోనే నివేదికను విడుదల చేయాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల వాయిదా పడింది.

హైదరాబాద్‌ లోని జరిగిన‌ ఈ కార్యక్రమానికి నాస్కామ్ చైర్మన్ రామన్ రాయ్ - వైస్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌ జీ - ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ హాజర‌య్యారు. నాస్కాం నివేదిక ప్ర‌కారం దేశీయ ఐటీ కంపెనీలు లాభాల బాట‌లోనే ఉన్నాయి. 2.35 శాతం ఎగిసిన ఇన్పోసిస్ కంపెనీ షేర్లు ప్రస్తుతం 1.35 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో - టీసీఎస్ - హెచ్ సి ఎల్ లు కూడ లాభాల్లో కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు ప్రకటించారు. 2017 లో ఐటీ ఇండస్ట్రీ ఆదాయం 11 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్టు వివ‌రించింది. ఉద్యోగుల‌కు తిరిగి నైపుణ్యాల్లో శిక్ష‌ణ అందించం మ‌రియు విద్యాసంస్థ‌ల‌తో ప‌రిశ్ర‌మ జ‌ట్టుక‌ట్ట‌డం అనే అంశాల‌పై దృష్టి సారించాల‌ని నాస్కాం వివ‌రించింది.

తాజా నివేదిక‌పై నాస్కామ్ మాజీ చైర్మన్, సైయెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 8-10 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకోనుంద‌న్నారు. వచ్చే మార్చి నాటికి ఐటీ రంగంలో 1.50-1.80 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. గడిచిన సంవత్సరంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని ఆయ‌న‌ వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News