అమెరికాలో మరో ‘భారతీయుడ్ని’ కాల్చేశారు

Update: 2017-03-04 09:41 GMT
అమెరికాలో జాత్యాంహారం అంతకంతకూ రెట్టింపు అవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి జాతివివక్షతో కొందరు చేస్తున్న విపరీత చేష్టలు ఎంతలా ఉన్నాయన్న విషయం ఈ మధ్యన తరచూ బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న తెలుగోడు శ్రీనివాస్ కూఛిబొట్లను జాత్యాంహారంతో దారుణంగా కాల్చి చంపిన వైనం అమెరికాలో పెను దుమారాన్ని రేపటమేకాదు.. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఖండించిన పరిస్థితి. ఈ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే అమెరికాలో మరో దారుణం చోటుచేసుకుంది.

జాతివివక్షతో మరో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను.. ఆయన ఇంటి దగ్గరే కాల్చిన దారుణ ఉదంతం అమెరికాలో తాజాగా చోటు చేసుకుంది. దక్షిణ కరోలినా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.24 గంటల వేళలో భారత సంతతికి చెందిన హర్నీష్ పటేల్ ను ఆయన ఇంటి దగ్గరే కొందరు దుండగలు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. అతి సమీపం నుంచి కాల్పులు జరపటంతో.. ఘటనాస్థలంలోనే హర్నీష్  కుప్పకూలినట్లుగా చెబుతున్నారు.

కాన్సస్ దారుణాన్ని మర్చిపోక ముందే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. లాంకస్టెర్ కౌంటీ షెరిఫ్ కు దగ్గర్లోనే హర్నీష్ కు స్టోర్ ఉంది. అందరితో స్నేహంగా ఉంటూ.. మంచి పేరున్న వ్యక్తి హత్యకు గురికావటాన్ని పలువురు ఖండిస్తున్నారు.

పటేల్ మృతికి పలువురు స్థానికులు సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. పటేల్ లాంటి మంచి వ్యక్తిని ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాము ఊహించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది జాతివివక్షతో జరిగిన హత్యగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తమ తండ్రి హత్యకు గురైన నేపథ్యంలో స్టోర్ ను మూసివేస్తూ పటేట్ పిల్లలు పోస్టర్ ను ఏర్పాటు చేశారు. తమ కుటుంబంలో చోటుచేసుకున్న అత్యవసర పరిస్థితుల కారణంగానే స్టోర్ ను కొన్ని రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పలువురు ప్రవాసీయులు షాక్ కు గురి అవుతున్నారు.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News