అమెరికాలో మన టెకీల‌కు ఇంకోషాక్‌

Update: 2019-02-23 16:08 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రో షాక్ ఇవ్వ‌డం ఖ‌రారైంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు. ఏకంగా 90,000 మంది భార‌తీయుల క‌ల‌లు తీవ్రంగా ప్ర‌భావితం అయ్యే నిర్ణ‌యం వెలువ‌డ‌టం ఖాయమైంది. అమెరికాలో పనిచేసే భారత వృత్తి నిపుణులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగులనున్నది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలిగించేందుకు ప్రస్తుతమున్న నిబంధనల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలు అధ్యక్ష భవనం వైట్ హౌస్‌ కు అందాయి. 90 వేలమందికిపైగా హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు, ప్రధానంగా భారతీయులకు నష్టం వాటిల్లే ఈ ప్రతిపాదనలను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం బుధవారం వైట్ హౌస్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్‌ కు పంపినట్టు అధికారులు వెల్లడించారు.

అమెరికాలో చట్ట బద్ధంగా పనిచేయడానికి వీలుగా హెచ్‌1 బీ వీసా ఉన్నవారి జీవిత భాగస్వాములకు హెచ్‌4 వీసాను జారీ చేస్తున్నారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ మేర‌కు వెసులుబాటు చట్టం తెచ్చారు. ఇలా వీసా పొందిన వారిలో చాలా మంది భారత్‌ కు చెందిన నిపుణులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 90,000 మంది భారతీయులకి హెచ్‌4 వీసా ఉన్నట్లు అంచ‌నా. ఇలాంటి కీల‌క‌మైన అంశంలో మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తాజాగా ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించి త‌న కార్యాల‌యానికి తెప్పించుకున్న‌ట్లు స‌మాచారం.

వైట్‌ హౌస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ నిర్ణయం అమలు ఇప్పుడే జరుగదని, కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. కానీ నిర్ణ‌యం వెలువ‌డటం ఖాయ‌మ‌ని ప‌లువురు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఈ మేర‌కు స్ప‌ష్ట‌త రానుంది.

Tags:    

Similar News