న్యూజిలాండ్ లో ఎంపీగా గెలిచిన హిమాచల్ వాసి !

Update: 2020-10-20 01:30 GMT
తాజాగా న్యూజిలాండ్‌ లో జరిగిన ఎన్నికల్లో ఓ భారతీయుడు విజయం సాధించాడు. 33 ఏళ్ల డాక్టర్‌ గౌరవ్‌శర్మ హామిల్టన్‌ వెస్ట్‌ ప్రాంతం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించాడు. 20 ఏళ్ల క్రితం హిమాచల్ ‌ప్రదేశ్‌ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌ లో స్థిరపడ్డ గౌరవ్‌ అధికార లేబర్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం అందుకున్నారు. గౌరవ్ కి ఈ ఎన్నికల్లో మొత్తంగా 16,950 ఓట్లు పోలవ్వడంతో ప్రత్యర్థి టిమ్‌ మసిండోపై 4,425 ఓట్లు తేడాతో గెలుపొందారు.

ఈ సందర్భంగా హిమాచల్ ‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకుర్‌ , గౌరవ్‌‌ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు.హిమాచల్‌ ప్రదేశ్ ‌లోని హామిర్‌ పుర్‌ జిల్లాకు చెందిన గౌరవ్‌ 9వ తరగతి చదువుతున్నప్పుడే , అంటే దాదాపుగా 20 ఏళ్ల క్రితం ఆయన కుటుంబం న్యూజిలాండ్‌ కు వలస వెళ్లింది. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ గా ఉద్యోగాన్ని వదిలేసి గౌరవ్‌ తండ్రి కుటుంబంతో సహా అక్కడకు వెళ్లారు. అయితే వారు మొదట అక్కడ అనేక కష్టాలు పడ్డారు. మొదటి ఆరేళ్లపాటు గౌరవ్‌‌ తండ్రికి ఎలాంటి ఉద్యోగం లభించలేదు. అయితే, ఎట్టకేలకు ఓ ఉద్యోగం సాధించి హామిల్టన్‌ లో స్థిరపడ్డారు. ఆ తరువాత అక్కడ వైద్య విద్య పూర్తిచేసిన గౌరవ్‌ ప్రస్తుతం నవ్ ‌టన్‌ నగరంలో డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు.

ప్రజల కష్టాలపై గళమెత్తే డాక్టర్ గౌరవ్‌ పలు దేశాల్లోని శరణార్థుల హక్కులకోసం పోరాడారు. 2015లో నేపాల్ ‌లో సంభవించిన భారీ భూకంపంలో ఇళ్లు కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచారు. ఇక , కరోనా కాలంలో హామిల్టన్ ‌లో విశేష సేవలందించారు. ప్రజలు మహమ్మారి నుంచి కోలుకునేందుకు తీవ్రంగా కృషి చేసారు. ఆ కృషికి మెచ్చి హామిల్టన్‌ వెస్ట్‌ ప్రజలు గౌరవ్‌ శర్మకు అపూర్వమైన విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ ‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే , గతంలో ఎన్నడూ లేని ఈ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. గతంలో మెజారిటీ సాధించిన పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటుచేసుకొని పరిస్థితి ఉండేది. కానీ తాజా ఎన్నికల్లో ప్రజలు లేబర్‌ పార్టీకి పూర్తి మెజారిటీని అందించారు. దీనికి ప్రధాన కారణం ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కరోనా సమయంలో చూపిన సమయస్ఫూర్తే .. మొట్ట మొదటగా కరోనా ఫ్రీ గా ప్రకటించిన దేశం న్యూజిలాండ్ కావడం విశేషం.
Tags:    

Similar News