బీజేపీ చ‌రిత్ర‌లో ఎప్పుడూ ఇలాంటి ఎన్నిక జ‌ర‌గ‌లేదు: మల్లిఖార్జున ఖ‌ర్గే హాట్ కామెంట్స్‌!

Update: 2022-10-08 10:30 GMT
అఖిల భార‌త కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వ‌చ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఖర్గేకి తెలంగాణ కాంగ్రెస్  నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఖర్గే వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా హైదరాబాద్ వచ్చారు. అక్కడి నుంచి గాంధీ భవన్ చేరుకున్న ఖర్గే.. అక్క‌డ‌ పీసీసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే టీపీసీసీ ప్రతినిధులతో భేటీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఆ త‌ర్వాత గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖ‌ర్గే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కొందరిని మాత్రమే బీజేపీ ఐశ్వర్యవంతులను చేస్తోందని నిప్పులు చెరిగారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం బ‌తికి బ‌ట్ట క‌ట్టాలంటే మోదీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల‌ని పిలుపునిచ్చారు. దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మై మోదీని ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

అక్టోబ‌ర్‌ 17న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయ‌ని ఖ‌ర్గే తెలిపారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నానన్నారు. తనకు ఓటేయాలని పీసీసీ సభ్యుల్ని కోరేందుకు హైదరాబాద్‌కు వ‌చ్చాన‌న్నారు. 136 ఏళ్లలో నాలుగు సార్లు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరిగాయన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌, సీతారాం కేసరి, సోనియా గాంధీ బ‌రిలో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని ఖ‌ర్గే తెలిపారు. ఇప్పుడు తాను పోటీలో ఉన్నాన‌ని చెప్పారు. ఇప్ప‌టికే చాలా మంది సీనియర్లు తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు.

తాను కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యితే ఉదయ్ పూర్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న డిక్లరేషన్‌ను అమలు చేస్తాన‌ని ఖ‌ర్గే తెలిపారు. రైతులు, యువత, మహిళా అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తాన‌ని హామీ ఇచ్చారు. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగిత మరింత పెరిగింద‌ని మండిప‌డ్డారు. మోదీ పాలనలో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ.82కు పడిపోయింద‌ని గుర్తు చేశారు. దీనివల్ల పెట్రోల్‌, డీజిల్‌లతో పాటు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుతున్నాయ‌న్నారు.

కాగా ఇటీవ‌ల కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ కూడా హైద‌రాబాద్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌ట్టించుకోలేదు. అయితే మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప‌ర్య‌ట‌న‌లో మాత్రం దాదాపు అంద‌రూ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు పాల్గొన‌డం విశేషం.

మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు కాంగ్రెస్ అగ్ర నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అండ‌దండ‌లుండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. దీంతో మ‌ల్లిఖార్జున‌ ఖ‌ర్గే గెలుపు ఖాయ‌మైన‌ట్టేన‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News