ఏపీలో త‌గ్గిన మ‌ద్యం విక్ర‌యాలు.. పెరిగిన ఆదాయం!

Update: 2022-09-02 06:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాక్షిక మ‌ద్య‌పాన నిషేధం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 2018-19లో మద్యం వినియోగం 384.31 లక్షల కేసుల నుంచి 2021-22 నాటికి 278.5 లక్షల కేసులకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేర‌కు మ‌ద్యం వినియోగం త‌గ్గిన‌ట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా ఇదే కాలానికి బీర్ విక్రయాలు 277.10 లక్షల కేసుల నుంచి 82.6 లక్షల కేసులకు తగ్గాయ‌ని వెల్ల‌డించారు.

మ‌ద్యం వినియోగం తగ్గినా ధరలు విపరీతంగా పెరగడంతో ఇదే కాలానికి మ‌ద్యం ఆదాయం రూ.20,128 కోట్ల నుంచి రూ.25,023 కోట్లకు పెరిగింది.

గత ఆర్నెల్లలో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తం 20,127 కేసులు నమోదయ్యాయ‌ని అధికారులు తెలిపారు. 16,027 మందిని అరెస్టు చేసి 1,407 వాహనాలు సీజ్‌ చేశామ‌ని వివ‌రించారు. నాటుసారా తయారీనే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాల‌న్నారు. ఆహార ధాన్యాలు, ఇతర పంటలను సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, సహకారాన్ని అందించాల‌న్నారు. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయి సాగుపై దాడులు నిర్వహించాలి.

2,500 ఎకరాల్లో గంజాయి సాగును వ‌దిలేసి ఇత‌ర పంట‌ల‌ను పండిస్తున్నార‌ని అధికారులు సీఎం జ‌గ‌న్‌కు తెలిపారు. పండించిన పంటలను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. మరో 1,600 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివ‌రించారు. విద్యార్థులు, యువతకు గంజాయి, ఇతర పదార్థాలు అంద‌కుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల ముందు ఎస్ఈబీ నంబర్‌లు ప్రదర్శించాల‌న్నారు. అలాగే మాదకద్రవ్యాల‌ను వినియోగించ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  ఈ మేర‌కు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

అదేవిధంగా అవినీతి నిర్మూలనకు ఏసీబీ నంబర్‌ 14400ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కనిపించేలా పెట్టాల‌ని సీఎం ఆదేశించారు. దీనికోసం కచ్చితంగా బోర్డులు అమర్చాల‌న్నారు. గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ, పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ, రేష‌న్ షాపుల వద్ద కూడా ఈ నంబర్‌తో బోర్డులు కనిపించాల‌ని ఆదేశాలు ఇచ్చారు.  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను కొత్తరూపు ఇచ్చి పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో వీటిని తీర్చిదిద్దాల‌ని కోరారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News