క‌రోనా మ‌రింత బ‌ల‌ప‌డుతోందా? ఐఐటీ నిపుణుల మాట‌!

Update: 2021-09-01 01:30 GMT
దేశంలో కరోనా మూడో దశ అక్టోబరు-నవంబరు మధ్య ఉద్ధృతంగా ఉండొచ్చని ఐఐటీ- కాన్పుర్‌ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న వైరస్‌ రకాలను మించి తీవ్రమైన కొత్తరకం వైరస్‌ సెప్టెంబరు నాటికి బయటపడితేనే ఈ పరిస్థితి వస్తుందన్నారు. రెండో దశ కేసులతో పోల్చితే మూడో దశ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని లెక్కగట్టారు. మూడోదశ తీవ్రత ఎలా ఉండబోతుందన్న అంశంపై మనీంద్ర నేతృత్వంలోని ముగ్గురు శాస్త్రవేత్తల బృందం గణిత నమూనా ఆధారంగా వివిధ అంచనాలు రూపొందించింది.

ప్రస్తుత వైరస్‌ రకాలే కొనసాగితే పరిస్థితిలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. ఒకవేళ వీటికి భిన్నమైన, ప్రమాదకర కరోనా వైరస్ పుట్టుకొస్తే మాత్రం.. గరిష్ఠంగా రోజూ లక్ష వరకు కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం డెల్టా కంటే ప్రమాదకరమైన వైరస్‌ రకాలు మన దేశంలో లేవు. ఒకవేళ సెప్టెంబరు నాటికి అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం.. మూడోదశ కేసులు అక్టోబరు-నవంబరు మధ్య తీవ్రస్థాయిలో ఉంటాయి అని మ‌నీంద్ర హెచ్చ‌రించారు. ప్రస్తుత డేటా ప్రకారం వైరస్‌ పునరుత్పత్తి రేటు (ఆర్‌ వాల్యూ) 0.89 శాతంగానే ఉంది. ఈ విలువ 1 కంటే తక్కువ ఉన్నంతవరకూ వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు భావిస్తారని ఆయ‌న తెలిపారు. అయితే.. ఇది వ‌చ్చే రెండు మాసాల్లో పెరిగే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని తెలిపారు.

మ‌రోవైపు ఈ హెచ్చ‌రిక‌ల‌పై కేంద్రం కూడా దృష్టి పెట్టింది. అన్ని రాష్ట్రాల‌ను హెచ్చ‌రించింది. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ఏపీ, తెలంగాణ, మ‌హారాష్ట్ర‌, యూపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌ను న‌రేంద్ర మోడీ హెచ్చ‌రించారు. అవ‌స‌ర‌మైతే.. మ‌ళ్లీ క‌ర్ఫ్యూ విధించాల‌ని సూచించారు. ఇక‌, మాస్కుల‌ను త‌ప్ప‌ని స‌రిచేయాల‌ని.. బ‌హిరంగ ప్రాంతాల్లో క‌ట్టుదిట్టంగా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని .. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాల‌కు లెట‌ర్‌లు రాసింది. ఈ క్ర‌మంలో ఒక‌వైపు నిపుణుల హెచ్చ‌రిక‌లు.. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు మూడోద‌శ ముప్పు ఎక్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




Tags:    

Similar News