గంటా వైసీపీలోకి...శిష్యుడు చక్రం తిప్పుతారా...?

Update: 2022-11-25 02:30 GMT
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం మీద మరోసారి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన టీడీపీలో ఉంటున్నా కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. అలాగని ఆయన రాజకీయాలకు దూరంగా లేరు. ఆయన వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారు అని అంటున్నారు. మరి టీడీపీలో ఉంటే కనుక స్పీడ్ పెంచాలి కదా అన్న చర్చ సొంత పార్టీలోనే ఉంది.

అయితే గంటా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయని ఆయన సరైన టైం లో వాటికి పదును పెట్టి తన రాజకీయం గుట్టు ఏంటో చెబుతారు అని అంటున్న వారూ ఉన్నారు. అయితే విశాఖ జిల్లా వైసీపీలో తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు చూస్తే గంటాను వైసీపీ ఆహ్వానిస్తుందా అన్న చర్చ మొదలైంది. గంటా నిజానికి రెండేళ్ల క్రితం వైసీపీలోకి వద్దామని భావించారని ప్రచారం ఉంది.

ఆయన పార్టీ మారడానికి టైం డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నా చివరి నిముషంలో అది వాయిదా పడిదని కూడా అప్పట్లో అంతా అనుకున్నారు. దానికి కారణం ఆనాడు విశాఖలో ఉంటూ చక్రం తిప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయనతో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు అని చెప్పుకున్నారు. ఈ ఇద్దరు బ్రేక్ వేయడం వల్లనే గంటా వైసీపీలోకి అడుగుపెట్టలేకపోయారు అని ప్రచారం సాగింది.

అయితే గిర్రున కాలం తిరిగేసరికి సీన్ అంతా మారిపోయింది. విజయసాయిరెడ్డి ఇపుడు విశాఖ వైసీపీ రాజకీయాల నుంచి దూరం అయ్యారు. ఆరు నెలల క్రితం అవంతి మంత్రి పదవి పోయింది, ఇపుడు ఏకంగా వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ పదవి పోయింది. దాంతో గంటా వైసీపీలోకి వస్తాను అంటే ఆపే శక్తి ఎవరికీలేదు. మరో వైపు చూస్తే గంటా ఒకనాటి శిష్యుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ విశాఖ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన గంటా చలువతోనే ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు.

ఆయన ఇపుడు వైసీపీ పగ్గాలు అందుకున్నారు.  ఆ పార్టీలో  కీలకంగా మారుతున్నారు. మరి ఆయన పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. ఆయన నుంచి అధినాయకత్వం అదే ఆశిస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన 2019 ఎన్నికలలో ఓడిన విశాఖ సిటీలో ఈసారి వైసీపీ జెండా ఎగరేయాలంటే గంటా లాంటి బిగ్ షాట్ ని ఈ వైపునకు తిప్పుతారా అన్న దాని మీద అంతా ఆలోచనలు చేస్తున్నారు.

ఇక గంటా వైసీపీలోకి వస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన కోరుకున్న భీమిలీ సీటుని పార్టీ ఇస్తుంది అని అంటున్నారు. అలాగే ఆయన అనుచరులకు ఒకరిద్దరికీ టికెట్లు ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఆయన బ్యాచ్ అంతా వైసీపీలోనే ఉంది, మాజీ ఎమ్మెల్యే రహమాన్, అనకాపల్లికి చెందిన రియల్టర్ కాశీ వంటి వారు వైసీపీలో కీలకంగా ఉన్నారు.

దాంతో వారికి టికెట్లు ఇస్తూ గంటాకు కూడా కోరుకున్న భీమిలీ ఇచ్చి మచ్చిక చేసుకోవచ్చు అని అంటున్నారు. గంటా కనుక వైసీపీలో చేరితే విశాఖ సిటీలో ఫ్యాన్ పార్టీ జాతకం మారుతుంది అన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని, అందులో భాగమే పంచకర్లకు పదవి అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News