మునుగోడు డబ్బులకు వంగింద...?

Update: 2022-11-07 14:30 GMT
మునుగోడు ఉప ఎన్నిక దేశాన్ని మొత్తం ఆకట్టుకుంది. ఇంతకీ ఆ ఉప ఎన్నిక విశేషం ఏంటి. దానికి అంత ప్రాధాన్యత ఉందా అంటే చాలానే ఉందని చెప్పాలి. రాజకీయ విశ్లేషకులు కొందరు అయితే మునుగోడు ఉప ఎన్నిక మీద విస్తృతమైన పరిశోధన చేయాలని కూడా కోరడం గమనార్హం. అంటే ఇది సెటైరికల్ గా చేస్తున్న సూచన అన్న మాట.

మునుగోడులో ఒక పధ్ధతి ప్రకారం డబ్బు పంపిణీ జరిగింది అని ప్రచారంలో ఉన్న మాట. అలాగే మునుగోడులో గ్రామంలో వార్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారిని కూడా విడిచిపెట్టకుండా సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించారని కూడా కధనాలు వచ్చాయి.

మొత్తానికి అందరూ ప్రలోభాలు పెట్టారు. ఎవరికీ తోచిన తీరున వారు  ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఇందులో ఎవరికీ ఎవరూ తీసిపోరు అనే చెప్పాలి. దీని మీద సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైన వ్యంగ్య వ్యాఖ్యలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.  మునుగోడులో ప్రచారంలో ఉన్న దాని మేరకు చూస్తె అధికార టీయారేస్ పార్టీ ఓటుకు అయిదు వేల రూపాయలు ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు.

ఆ తరువాత స్థానం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీది. ఆ పార్టీ ఓటుకు నాలుగు వేల రూపాయల దాకా ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇక మూడవ పార్టీగా కాంగ్రెస్ ఓటుకు అయిదు వందల నుంచి వేయి దాకా చెల్లించారు అని అంటున్నారు.  ఫలితాలు కూడా ఓటుకు నోటుకు విలువ కట్టి ఆ విధంగానే వచ్చాయని అంటున్నారు.

మొదటి స్థానంలో టీయారేస్ ని  నిలిపి మునుగోడు ఓటరన్న గెలిపించాడు. ఎంతైనా ఓటుకు అయిదు వేల రూపాయలు కదా. ఇక రెండవ స్థానంలో బీజేపీని ఉంచాడు. నాలుగు వేలు ఇచ్చిన రుణాన్ని ఆ విధంగా చూపించాడు అని అంటున్నారు. అయిదు వందల నుంచి వేయి రూపాయలు ఇచ్చిన కాంగ్రేస్ కి మూడవ స్థానం ఇచ్చి డిపాజిట్ గల్లంతు చేసాడు.

దీన్ని బట్టి అర్ధమయ్యే విషయం ఏమిటి అంటే ఓటుకు వేయి రూపాయలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే వారికీ డిపాజిట్లు కూడా దక్కవు అని. అంతేకాదు ఓటుకు ఎంత నోటు పలికితే అంతలా జై కొడతారు అని. మొత్తానికి మునుగోడు ఓటరన్న డబ్బుకు లోంగాడా అంటే జవాబు జనాలే చెప్పాలి.  ఇది ఒక ప్రయోగం, ఒక పరిశోధన. ప్రజాస్వామ్యం ఏ తీరున సాగుతుందో చెప్పడానికి ఒక లిట్మస్ టెస్ట్.

ఇది హిట్ అయిందని ఎవరైనా భావిస్తే ఇక మీదట ఓటుకు రేటు అయిదు వేలు కూడా దాటేసి ఎక్కడికి పోతుందో  ఎవరూ చెప్పలేరు. ఎంతైనా మునుగోడు తీర్పు అంటే అదే మరి. ఇది ఒక ప్రమాణం. ఒక కొలమానం. రాజకీయ జీవులకు, పార్టీలకు కూడా అతి పెద్ద కొలబద్ద. నైతిక సూత్రాలకు అదే అడ్డుకట్ట. అయినా ఇంతా చేసి చూసిన వారు ఎవరైనా నైతికత గురించి మాట్లాడితే తప్పు వినే వారిదే సుమా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News