విడాకులు పబ్లిసిటీ కోసమా? అవమానం! సానియాపై నెటిజ‌న్ ఫైర్!!

Update: 2022-11-14 02:54 GMT
గ‌త కొంత‌కాలంగా ఆద‌ర్శ జంట సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారంటూ క‌థ‌నాలు సంచ‌ల‌నంగా మారాయి. తొలుత పాకిస్తాన్ మీడియా దీనిని ప్ర‌చురించ‌గా భార‌తీయ మీడియాలోను ఆ వార్త‌లు పుంఖానుపుంఖాలుగా వెలువ‌డ్డాయి. దీంతో టెన్నిస్ స్టార్ సానియా ప్ర‌పంచ‌వ్యాప్త అభిమానుల్లో ఇది అల‌జడిని రేపింది. ఈ జంట ఇన్నేళ్ల త‌ర్వాత‌ విడిపోవ‌డం త‌గ‌ద‌ని.. వారు ఎంతో అంద‌మైన జంట! అని అభిమానులు కోరుకున్నారు. అయితే విడాకులు నిజ‌మేనా? అంటే ... తాజాగా దీనికి ఆన్స‌ర్ దొరికింది.

విడాకుల పుకార్ల న‌డుమ అక‌స్మాత్తుగా సానియా-షోయ‌బ్ జంట చేసిన ఓ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ఈ జంట ఇప్పుడు క‌లిసి ఓ టీవీ రియాల్టీ షోను నిర్వ‌హిస్తున్నామ‌ని ప్రకటించారు. విడాకులు తీసుకున్నారనే ఊహాగానాల న‌డుమ‌ OTT ప్లాట్ ఫారమ్ ఉర్దు ఫ్లిక్స్ శనివారం ఇన్ స్టాగ్రామ్ లో సానియా - షోయబ్ తమ షో 'ది మీర్జా మాలిక్ షో'తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. స్టార్ కపుల్ తో కూడిన షో పోస్టర్ ను షేర్ చేస్తూ ''ది మిర్జా మాలిక్ షో అతి త్వరలో ఉర్దూఫ్లిక్స్ లో మాత్రమే'' అని రాసి ఉంది. పోస్టర్ లో సానియా త‌న భ‌ర్త‌ షోయబ్‌ భుజంపై చేయి వేసి ఎంతో ధీమాగా ఉల్లాసంగా క‌నిపించింది.

నెటిజ‌నుల్లో గంద‌ర‌గోళం....

అయితే  ఈ జంట నుంచి వ‌చ్చిన ఆక‌స్మిక ప్ర‌క‌ట‌న నెటిజనుల‌ను గందరగోళానికి గురి చేసింది. ''ఇది పబ్లిసిటీ స్టంట్ కాదా?'' అంటూ ఒక సోషల్ మీడియా వినియోగదారు వ్యాఖ్యానించారు. ''కాబట్టి ఈ హంగామా అంతా విడాకులు పబ్లిసిటీ కోసమేనా.. ఎంత‌టి అవమానం?'' అని మరొకరు రాశారు. ''ఒకరినొకరు క్షమించండి.. ఒకరితో ఒకరు కలిసి ఉండండి.

ఇద్దరూ కలిసి అందంగా ఉన్నారు'' అని మరొక అభిమాని రాశాడు. చాలా మంది ఈ జంట‌ను దూషిస్తూ ప్ర‌శ్నించారు. ర‌క‌ర‌కాల సందేహాలు లేవనెత్తారు. అయితే ఈ జంట షో గురించి తెలుసుకున్న తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు సంతోషించారు. వారు విడిపోనందుకు సంతోషం వ్య‌క్తం చేసారు.

సానియా మీర్జాతో విడాకుల పుకార్ల న‌డుమ‌ పాకిస్థానీ నటి కం మోడ‌ల్ అయేషా ఒమర్ తో ఉన్న షోయబ్ మాలిక్ ఫోటోలు వైరల్ గా మారాయి. స‌ద‌రు మోడ‌ల్ తో మాలిక్ ఎఫైర్ సాగిస్తున్నాడ‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అంతేకాదు స‌ద‌రు మోడ‌ల్ కం నటిని చంపేస్తానంటూ సానియా వ్యాఖ్యానించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. చివ‌రికి సానియా-మాలిక్ జంట‌ విడిపోనందుకు అంద‌రూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ రియాలిటీ షో ప‌బ్లిసిటీ కోసం ఇదంతా చేశార‌ని తెలుసుకుని అభిమానులు సీరియ‌స్ అవుతున్నారు. వివాహాన్ని అప‌ఖ్యాతి పాలు చేయ‌డ‌మేన‌ని కూడా భార‌తీయ వ్య‌వ‌స్థ‌లో నెటిజ‌నుల్లో కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

షోయబ్- సానియా 2010లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. వారు తమ కుమారుడు ఇజాన్ ను 2018లో స్వాగతించారు. ఇటీవల షోయాబ్- సానియా తమ 12 సంవత్సరాల సుదీర్ఘ వివాహాన్ని విడాకుల‌తో ముగించారని... వారి కుమారుడికి సహ-తల్లిదండ్రులుగా ఉన్నారని పేర్కొంటూ అనేక క‌థ‌నాలు ఆన్ లైన్ లో ప్రసారం అయ్యాయి. ఈ పుకార్లపై ఈ జంట ఇంకా స్పందించలేదు. రియాలిటీ షో ప్ర‌క‌ట‌న త‌ర్వాత క‌లిసే ఉంటున్నార‌ని ఊహిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News