ఈటలకు టీఆర్ఎస్సే ప్రచారం చేస్తోందా ?

Update: 2021-10-24 08:33 GMT
అవును మీకు ఆశ్చర్యంగా ఉన్నా జరుగుతున్నది అదే. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అనివార్యమని అర్ధమైపోయిన దగ్గర నుండి యావత్ టీయార్ఎస్ ఈటల జపమే చేస్తున్నది. ఒకవైపు ఈటలను ఎలాగైనా ఓడించాల్సిందే అనే టార్గెట్ పెట్టుకుని మరీ ఈటల జపం చేస్తున్నది. ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మరీ అన్యాయమైపోయింది కారు నేతల వ్యవహారం. కేసీయార్, కేటీయార్, హరీష్ రావు, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సినియర్ నేతలు ఇలా ఒకరనేమిటి అందరు ఈటలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నవారే.

హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ గనుక ఓడిపోతే కేసీయా ర్ ఇజ్జత్ మొత్తం పోవటం ఖాయం. ఒకవైపేమో ఉపఎన్నికలో గెలిచినా ఓడినా మాకు ఒకటే అని చెబుతునే మరోవైపు ఈటల ఎట్టి పరిస్ధితిలోను గెలవకూడదని టార్గెట్లు పెడుతున్నారు కేసీయార్. ప్రచారంలో పొద్దునలేచిన దగ్గర నుండి రాత్రి ప్రచారం ముగిసేదాకా టీఆర్ఎస్ ప్రచారంలో అధికభాగం ఈటలపై ఆరోపణలు, విమర్శలతోనే సరిపోతోంది.

నిజానికి ఈటల తమకు ప్రత్యర్ధే కాదని కేసీయార్ అండ్ కో అనుకున్నపుడు అసలు ఈటల గురించి ప్రస్తావన ఎందుకు ? గడచిన ఏడేళ్ళల్లో తాము చేసిన అభివృద్ధి గురించే చెప్పుకోవచ్చు కదా. దళితబంధు పథకాన్ని ఎంత అద్భుతంగా అమలు చేస్తున్నమో ఓటర్లకు చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే దళిబంధు పథకానికి హుజూరాబాదే పైలెట్ ప్రాజెక్టు కాబట్టి. తమ ఘనకార్యాలు, ఘనకీర్తులు చెప్పుకోవటం వదిలేసి ఎంతసేపు ఈటల గురించి మాట్లాడటం చూస్తుంటే అసలు ఈటలకు టీఆర్ఎస్సే ప్రచారం చేస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా కేటీయార్ మాట్లాడుతు ఓ హోటల్లో ఈటల-రేవంత్ రెడ్డి భేటీ అయ్యారనే ఓ పనికిమాలిన సబ్జెక్టు బయటపెట్టారు. అదేదో తమకు మాత్రమే తెలిసిన రహస్యమన్నట్లు, వీళ్ళ భేటీతో తెలంగాణాకు ఏదో నష్టం జరిగిపోతోందన్నట్లుగా కేటీయార్ మాట్లాడారు. అయితే రేవంత్, ఈటల మాట్లాడుతు అవును తామిద్దరం కలుసుకున్నామని, అందులో తప్పేముందని కేటీయార్ ను ఎదురు ప్రశ్నించారు. దాంతో ఇపుడు కేటీయార్ దగ్గర సమాధానం లేదు. అసలు ఈటల, రేవంత్ కలిస్తే ఏమిటి ఎందుకు ? కలవకపోతే ఏమిటి ? దీని వల్ల కేటీయార్ కు కానీ లేకపోతే తెలంగాణాకు కానీ ఏమన్నా నష్టమా ?

 రేవంత్-ఈటల భేటీ గురించే టీఆర్ఎస్ నేతలంతా మూడు రోజులుగా ఒకటే గోల చేస్తున్నారు. తమ పార్టీ గురించి, తమ ప్రభుత్వం గురించి జనాలకు చెప్పుకోకుండా ఈటల, రేవంత్ ప్రస్తావన అవసరం ఏమిటో అర్ధం కావటంలేదు. ఏదో విధంగా ఈటలను బద్నాం చేయాలనే కసితో టీఆర్ఎస్సే ఈటలకు బాగా ప్రచారం చేసి పెడుతోంది. రేపటి ఎన్నికలో ఈటల గనుక గెలిస్తే బహుశా టీఆర్ఎస్ కే థ్యాంక్స్ చెప్పుకోవాలేమో.
Tags:    

Similar News