కొత్త రూటులో తుమ్మల వెళ్లనున్నాడా?

Update: 2020-03-09 06:24 GMT
రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బలమైన నేతగా ఎదిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా తన అనుభవంతో గులాబీ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఖమ్మంలో తిరుగునేతగా మారాడు. మంత్రిగా వుండి కూడా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మల నాగేశ్వర్ రావు దారుణంగా ఓడిపోవడంతో పరపతి దెబ్బతింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పదవీలేక సతమతమవుతోన్నారు.

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాడు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో తమ్మలు ఓటమి చెందినా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో నాలుగేళ్లు రాష్ట్రంలో బలమైన నేతగా ఎదగడంతోపాటు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. పార్టీలో తాను పెంచి పోషించిన నేతలు తన ఓటమికి పనిచేయడంతో 2018 ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓడిపోయాడు. దీంతో అప్పటివరకు కేసీఆర్ వద్ద తుమ్మలకు ఉన్న పరపతి క్రమంగా తగ్గుతూ వస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయినప్పటికీ తుమ్మల జిల్లాలో ప‌ట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పదవి లేక పోవడంతో తుమ్మల సతమతమవుతున్నారు. తుమ్మలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో టీఆర్ఎస్ లో వర్గ పోరుకు తెరలేచింది. పాలేరులో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కారెక్కడంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారింది.

పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవి దక్కడం.. ఖమ్మంలో పట్టు కోసం ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పావులు కదుపుతుడటంతో వర్గపోరు తీవ్రమవుతోంది. తుమ్మలకి రాజ్యసభ సీటు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మలను అనుచరులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. తుమ్మలకు పార్టీ మారాలని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల వియ్యంకుడు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరాడు. దీంతో తమ్మల కూడా బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలు విన్పిస్తున్నాయి. తాను పెంచి పోషించిన నేతలే తుమ్మలను పొమ్మనలేక పొగబోతున్నారు. దీంతో తమ్మల కొత్తదారి వైపు చూస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది. ఆయన టిఆర్ఎస్‌లోనే వుంటారా? లేక పార్టీ మారుతారా అనేది మాత్రం భవిష్యత్లో తేలనుంది.
Tags:    

Similar News