వణికిస్తున్న ఎక్స్ ప్రెస్ మీడియా సంస్థ కథనం

Update: 2015-09-11 09:38 GMT
ప్రాణభయంతో పుట్టిన గడ్డను వదిలి వలసపోతున్న వేలాది మంది శరణార్థులు యూరప్ లోని పలు దేశాలకు ఆస్ట్రేలియాకు తరలివెళ్లటం తెలిసిందే. మొదట్లో శరణార్థుల్ని అనుమతించే విషయంలో కరుకుగా వ్యవహరించిన దేశాలు తర్వాత మానవతా దృష్టితో అంగీకరించటంతో గత కొద్దిరోజులుగా సిరియా.. ఇరాక్ కు చెందిన వేలాదిమంది బ్రిటన్.. ఫ్రాన్స్.. గ్రీస్ పలు దేశాల్లోకి వలస వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ వ్యవహారంపై ఎక్స్ ప్రెస్ మీడియా సంస్థ తాజాగా ప్రచురించిన ఒక కథనం సంచలనం సృష్టించటమే కాదు.. ఆయా దేశాల్ని భయాందోళనలకు గురి చేసేలా ఉంది. ఇంతకీ ఆ సంస్థ ప్రచురించిన కథనం ఏమిటంటే.. వలస వస్తున్న శరణార్థుల్లో వేలాది మంది ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారని.. వారంతా కామ్ గా యూరప్ లోని దేశాల్లో సెటిల్ అయిపోయారని చెబుతోంది.

దీన్లో నిజనిజాల సంగతి తేలనప్పటికీ.. శరణార్థుల ముసుగులో ఉగ్రవాదులు బ్రిటన్.. ఫ్రాన్స్ తో సహా పలు దేశాల్లోకి వచ్చేశారన్న వార్త ఇప్పుడు షాకింగ్ గా మారింది. అయితే.. దీన్ని యూరప్ లోని భద్రతా దళాలు కొట్టిపారేస్తున్నాయి. శరణార్థుల్లో ఉగ్రవాదులు ఉంటే.. తమ ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుందని వారు చెబుతున్నారు. ఈ కథనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యూరప్ లోని పలు దేశాలకు వస్తున్న శరణార్థులపై ఈ కథనం విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుందని.. ఉగ్రభయంతో వారికి అనుమతి నిరాకరిస్తే.. ప్రాణభయంతో వస్తున్న వారికి నిలువ నీడ లేకుండా పోతుందని.. ఇదంతా బాధ్యతరాహిత్యంతో ప్రచురిస్తున్న కథనాలని కొట్టిపారేస్తుంటే.. మరోవైపు.. ఇలాంటి ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా.. శరణార్థులపైనా.. వారికి అండగా నిలుస్తున్న దేశాల మీద ఎక్స్ ఫ్రెస్ మీడియా సంస్థ కథనం ప్రభావం చూపించటం ఖాయమని చెబుతున్నారు.


Tags:    

Similar News