మరణించిన సౌమ్యకు గౌరవ పౌరసత్వం.. ఇజ్రాయెల్ సంచలనం

Update: 2021-05-24 03:50 GMT
ఇప్పుడైతే కాల్పుల విరమణ జరిగింది కానీ.. కొద్ది రోజుల క్రితం వరకు ఇజ్రాయెల్ - హమస్ ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర దాడుల గురించి తెలిసిందే. ఈ దాడుల కారణంగా రెండు దేశాలకు చెందిన పలువురు మరణించటంతో పాటు.. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఇలా మరణించిన వారిలో ఇజ్రాయెల్ లో నర్సుగా సేవలు అందిస్తున్న కేరళకు చెందిన సౌమ్య సంతోష్ బాంబు దాడికి మరణించారు.

ఆమె మరణంపై ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ స్పందించారు. కేరళలోని సౌమ్య కుటుంబ సభ్యులకు ఇటీవల ఆయన ఫోన్ చేసి స్వయంగా పరామర్శించారు. ఇదిలా ఉండగా.. దాడుల్లో మరణించిన సౌమ్యకు అరుదైన గుర్తింపు ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరణానంతరం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది. విదేశాల్లో మరణించిన ఒక భారతీయురాలికి దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణిస్తున్నారు.

ఇజ్రాయెల్ లో ఎంతోమంది విదేశీయులు మరణించారని.. కానీ వారెవరికీ దక్కని గౌరవం సౌమ్యకు దక్కిందని ఆమె మరదలు షెర్లీ బెన్నీ పేర్కొన్నారు. ఆమెను ఇజ్రాయెల్ పౌరులు దేవదూతగా చూస్తారని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ నిర్ణయంపై సౌమ్య భర్త సంతోష్ మాట్లాడుతూ.. ఇది సౌమ్యకు దక్కిన గౌరవంగా తాము భావిస్తున్నట్లు చెప్పారు.

గౌరవ పౌరసత్వంపై తమకు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. అంతేకాదు.. తమ కుమారుడు అడోన్ బాధ్యతను కూడా స్వీకరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. సౌమ్యను తమ దేశ పౌరురాలిగా అక్కడి వారు చూసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఇజ్రాయెల్ లోని భారత ఉప రాయబారి రోరీ యెడీడియో వెల్లడించారు. ఇది చాలా అరుదైన నిర్ణయంగా చెబుతున్నారు.
Tags:    

Similar News