శశికళకు ఐటీ శాఖ షాక్

Update: 2021-09-09 04:11 GMT
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఇన్కమ్ టాక్స్ ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. తమిళనాడులోని పయనూరు గ్రామంలో శశికళ  పేరుతో ఉన్న రు. 100 కోట్ల విలువైన 28 ఎకరాల ఎస్టేట్ ను ఐటీ శాఖ సీజ్ చేసేసింది. ఎస్టేట్ గేటుకు తాళమేసి సీలు వేసింది. బినామీ నిరోధక చట్టం క్రింద ఇప్పటికే శశికళ అలియాస్ చిన్నమ్మ కు ఐటీ శాఖ చాలా నోటీసులిచ్చింది. ప్రస్తుతం సీజ్ చేసిన  ఈ ఎస్టేట్ విషయంలో కూడా ఇలాగే నోటీసులిచ్చింది.

బినామీ నిరోధక చట్టం క్రింద సీజ్ చేసిన ఎస్టేట్ తనదే అని నిరూపించుకునేందుకు చిన్నమ్మ తగిన ఆధారాలు చూపాలని ఐటీ శాఖ తన నోటీసులో చెప్పింది. ఎందుకంటే జయలలితకు సన్నిహితంగా ఉన్న కాలంలో చిన్నమ్మ భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టిందనే ఆరోపణలకు లెక్కేలేదు. శశికళ పేరుతో ఉన్న ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించిందే అని, వాటిలో చాలావరకు జయలలిత సంపాదించిన ఆస్తులే అని చిన్నమ్మపై చాలా ఆరోపణలున్నాయి.

అంతేకాకుండా చాలా కోర్టుల్లో కేసులు విచారణ దశలో ఉన్నాయి.  కొన్ని కేసుల్లో మొన్నటిదాకా శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకా కొన్ని కేసుల్లో విచారణ జరుగుతోంది. ఐటితో పాటు అనేక శాఖలు జరుపుతున్న విచారణలో ఎన్నో అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ప్రస్తుత ఎస్టేట్ తో పాటు 2017లోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 157 ఆస్తులపై దాడులు జరిపి సీజ్ చేశారు. శశికళ బంధువులతో పాటు జయలలితకు బంధువులైన దీపన్, దీపలకు కూడా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు.

2019లో శశికళదిగా ప్రచారంలో ఉన్న సుమారు  రు. 1600 కోట్ల విలువైన 800 ఎకరాల ఎస్టేట్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. 2020లో కొడనాడులోని టీ ఎస్టేట్ ను కూడా ఉన్నతాధికారులు సీలు వేసేశారు. అలాగే సిరుదాపూర్ లోని మరో 65 ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా చిన్నమ్మ కష్టపడి సంపాదించిన ఆస్తులుగా చెప్పుకుంటున్నారు.

ఐటి శాఖ సీజ్ చేసిన ఆస్తుల్లో ఒక్కదాన్ని కూడా ఎంతపెద్ద ఉద్యోగం చేసిన అధికారి కూడా నిజాయితీగా సంపాదించలేరు. అలాంటిది ఎలాంటి ఉద్యోగం, వ్యాపారం చేయకుండానే శశికళ ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించుకున్నారనేది అర్ధం కావటంలేదు. ఆ కిటుకేదో జనాలందరికీ చెబితే వాళ్ళు కూడా ఇన్నికాకపోయినా ఎంతో కొంత ఆస్తులు సంపాదించుకుంటారు. జరుగుతున్నది చూస్తుంటే సీజ్ చేసిన ఆస్తులేవీ జీవితకాలంలో చిన్నమ్మ తిరిగి సొంతం చేసుకోలేరేమో అని అనుమానంగా ఉంది. మరి విచారణలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News