ఐటీకి ఉప్పందించింది అత‌నేన‌ట‌!

Update: 2017-11-20 08:39 GMT
వారంరోజులుగా దేశంలోని అంద‌రి ద‌ృష్టినీ ఆక‌ర్షిస్తున్న అంశం త‌మిళ‌నాట జ‌రుగుతున్న ఐటీ దాడులు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి - దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌ల‌లిత ఇష్ట‌స‌ఖి.. శశికళ‌ - ఆమె స‌న్నిహితులు - కుటుంబ స‌భ్యులే లక్ష్యంగా ఈ దాడులు జ‌రిగాయి. దేశ‌చ‌రిత్ర‌లో తొలిసారిగా దాదాపు 200 ప్రాంతాల్లో ఆదాయ‌ప‌న్నుశాఖ దాడులు జ‌రిపింది. శ‌శిగ‌ణం సుమారు రూ.5ల‌క్ష‌ల కోట్లు ఆస్తులు పోగేసుకున్న‌ట్లు లెక్క‌తేల్చింది. అయితే ఇంత త‌క్కువ స‌మ‌యంలో అంత క‌చ్చితంగా ఐటీ అధికారుల‌కు శ‌శిక‌ళ అండ్ కో ఆస్తుల గుట్టు ఏ విధంగా చిక్కింది? దీని వెనుక ఎవ‌రున్నారు? ఎవ‌రి స‌హ‌కారంతో ఈ ఆప‌రేష‌న్‌ ను ఆదాయ‌ప‌న్ను శాఖ ఇంత విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లిగింది? ఐటీ త‌న టాస్క్ సక్సెస్‌ ఫుల్‌ గా పూర్తి చేయ‌డం వెనుక కీల‌క‌భూమిక‌ను ఎవ‌రు పోషించార‌నే ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉద‌యిస్తున్నాయి. వాట‌న్నింటికీ ఒకే పేరు స‌మాధానంగా వినిపిస్తోంద‌ని అంటున్నారు. అది వేరెవ‌రో కాదు జయ లలిత వ్యక్తిగత సహాయకుడు పూంగుండ్రనేన‌ని ఐటీ అధికారులు - శ‌శిక‌ళ‌ - దిన‌క‌ర‌న్ వ‌ర్గీయులు చెబుతున్నార‌ట‌.

అస‌లు ఎవ‌రీ పూంగుండ్ర‌న్‌? ఇంత‌కాలం ఏం చేసేవాడు. జ‌య‌ల‌లిత హ‌యాంలో ఆయ‌న పాత్ర ఏమిటి?  ఇరవైయేళ్లకు ముందు జయలలితకు ప్రసంగ పాఠాలు తయారు చేసే తంజావూరుకు చెందిన విశ్రాంత ఆచార్యుడు శంకరలింగం కుమారుడే పూంగుండ్రన్‌. పార్టీలో హవా పెరుగుతున్న వేళ జ‌య‌కు ఓ సహాయకుడి అవసరం ఏర్పడింది.  నమ్మిన బంటు శంకరలింగం కుమారుడైన పూంగుండ్రన్‌ ను ఆమె సహాయకుడిగా నియమించుకున్నారు. అప్పటి నుంచి పోయెస్‌ గార్డెన్‌ లో పూంగుండ్రన్ హ‌వా మొద‌లైంది. అమ్మ‌కోసం ఎంత పెద్ద‌వారు ఫోన్ చేసినా త‌న‌కే వివ‌రాలు వెల్ల‌డించేవారు. అలా క్ర‌మ‌క్ర‌మంగా పార్టీ వ్యవహారాల్లోనూ కీల‌కపాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. ఈ నేప‌థ్యంలో పోయెస్‌ గార్డెన్‌ లో శశికళ అడుగుపెట్టాక‌  పూంగుండ్రన్ ప్ర‌భ త‌గ్గింది. అయితే ఊహించ‌ని విధంగా 2011లో శశికళను జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి త‌రిమేయ‌డంతో పూంగుం డ్రన్‌ మళ్లీ తెరపైకి వచ్చాడు. అప్పటి దాకా శశికళ పేరుతో ఉన్న కొన్ని బినామీ ఆస్తులు పూంగుండ్రన్‌ పేరు మీదకు మారాయి.
 
ఆ త‌ర్వాత మారిన ప‌రిస్థితుల కార‌ణంగా శశికళ క్షమాపణలు చెప్ప‌డం జ‌య‌ల‌లిత ఆమెను మ‌ళ్లీ త‌న‌ నివాసంలోకి రానివ్వ‌డం జ‌రిగిపోయాయి. అయితే ఈ సారి శశికళ పోయెస్‌ గార్డెన్‌ పై పూర్తిగా పట్టు సాధించినా.. పూంగుండ్రన్‌ తో రాజీ ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారు. ఇదంతా గ‌తం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో శ‌శిక‌ళ అండ్ కంపెనీని ఐటీ అధికారులు మూడునెల‌ల కింద‌టే టార్గెట్ చేశార‌ట‌. అప్ప‌డు వారికి గుర్తొచ్చిన మొద‌టివ్య‌క్తి పూంగుండ్రనేన‌ని ప్ర‌చారం సాగుతోంది. జయలలితకు కుడిభుజంగా వ్యవహరించ‌డంతో ఆయ‌న ద్వారా చిన్న‌మ్మ టీమ్ ఆస్తుల వివ‌రాలు సంపాదించ‌వ‌చ్చ‌ని వారు భావించార‌ట‌.
 
ప్లాన్‌ లో భాగంగా ఐటీ అధికారులు ఎవ‌రికీ ఎలాంటి అనుమానం త‌లెత్త‌కుండా పూంగుండ్రన్‌ సహా శశికళ - దినకరన్‌ కుటుంబ సభ్యులు - బినామీలు - లాయర్ల నివాసాలు - కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిపార‌ని చెబుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ పత్రిక నమదు ఎంజీఆర్‌ పబ్లిషర్‌ గా ఉన్న పూంగుండ్రన్ కార్యాల‌యంపై దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే శశికళ కుటుంబీకులందరి అవినీతి అక్రమాలన్నీ వెలుగుచూశాయి. ఆ త‌ర్వాత కూడా  పూంగుండ్రన్‌ అందించిన సమాచారం ఆధారంగానే జయలలిత నివాసంలో అర్ధ‌రాత్రి తనిఖీలు జరిగాయంటున్నారు. కొన్నేళ్లుగా పోయెస్‌ గార్డెన్‌ లో జ‌రిగిన ప్ర‌తి వ్య‌వ‌హారంపై అత‌నికి పూర్తి అవ‌గాహ‌న ఉండ‌టంతోనే ఇది సాధ్య‌మైంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఒసారి త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు.. మ‌రో రెండు మూడు రోజులలో పోయెస్‌ గార్డెన్‌ లో తనిఖీలు జరిపేందుకు వ్యూహరచన చేస్తున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News