మాజీ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు..వాద్రాను బుక్ చేసేందుకేనా?

Update: 2020-03-04 16:30 GMT
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను బుక్ చేసే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఇంకా వేట సాగిస్తూనే ఉందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా... దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలో ఉన్న హర్యానాలో వందల ఎకరాల భూములను వాద్రా కంపెనీలకు కారు చౌకగా కట్టబెట్టే వ్యవహారం సాగిందని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే కదా. నాడు వాద్రా కంపెనీల భాగోతాన్ని బయటపెట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను నాడు హర్యానాలో అధికారంలో ఉన్న భూపేందర్ సింగ్ హుడా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా బదిలీ చేసిన వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న సంగతీ తెలిసిందే కదా. అయితే ఆ తర్వాత వాద్రా కంపెనీలపై అంతగా దాడులు జరిగిన దాఖలా కనిపించలేదు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక కూడా వాద్రాపై అంత పకడ్బందీగా గురి పెట్టిన దాఖలా కూడా కనిపించలేదు. ఏదో అలా ఒకసారి ఈ కేసును బూజు దులిపినట్లు కనిపించడం, ఆ వెంటనే దానిని అటకెక్కించిన చందంగా ఈ కేసు వ్యవహారం సాగింది.

అయితే ఇప్పుడు ఓ మోస్తరు సీరియస్ గానే మోదీ సర్కారు రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. వాద్రాను పక్కా ఆధారాలతోనే బుక్ చేయాలన్న సంకల్పంతో ఆదాయపన్ను శాఖను రంగంలోకి దించినట్లుగా ప్రచారం సాగుతోంది. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చీ రాగానే ఎంట్రీ ఇచ్చిన ఐటీ అధికారులు... గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఫరీదాబాద్ మాజీ ఎమ్మెల్యే లలిత్ నాగర్ ఇల్లు, కార్యాయాలయాలు, ఆయన బంధువుల ఇల్లపై బుధవారం ఏకకాలంలో దాడులు చేసింది. లలిత్‌ నాగర్‌ నివాసం సహా ఆయన సోదరుల నివాసాలతో పాటు దాదాపు ఆరు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరీ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఫతేపూర్‌ మాజీ సర్పంచ్‌ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. కాగా తనను వేధించేందుకే తన నివాసంపై ఐటీ అధికారుల దాడులు జరిగాయని నాగర్‌ ఆరోపించారు.

మొత్తంగా చూస్తుంటే... నేరుగా వాద్రాను టార్గెట్ చేయకుండా.. వాద్రా కంపెనీలకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు వాద్రాకు సహకరించారన్న ఆరోపణలు ఉన్న వారిని ఐటీ అధికారులు లక్ష్యంగా చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ సర్పంచ్ లపై ఐటీ అధికారులు సోదాలు చేశారంటే... వాద్రాను బుక్ చేసేందుకు పకడ్బందీగా పావులు కదులుతున్నాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా చూస్తే... ఈ తరహా దాడులతో వాద్రా బుక్ అయిపోయినట్టేనన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజా సోదాల్లో ఏమేం లభించాయన్న వివరాలను ఐటీ అధికారులు టయబకు వెల్లడించకున్నా... కీలక సమాచారం అయితే స్వాధీనం చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. చూద్దాం... ఈ దాడులు వాద్రాను ఏ మేరకు ఇబ్బంది పెడతాయో?


Tags:    

Similar News