వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ వర్సెస్ కేజ్రీవాల్‌

Update: 2022-03-10 16:30 GMT
అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామంగా మారాయి. ఓ వైపు బీజేపీ త‌న  ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిల‌బెట్టుకుంది. దీంతో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ బీజేపీ గెలిచి మూడోసారి మోడీ ప్ర‌ధాని అయేందుకు రూట్ క్లియ‌రైంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ప‌క్క‌కుతోసి గ‌ద్దె మీద కూర్చోబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ సంచ‌ల‌నం సృష్టించింది.

తొలిసారి ఓ ప్రాంతీయ పార్టీ ఒక‌టి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన అరుదైన ఘ‌న‌త‌ను ఆప్ సొంతం చేసుకోనుంది. ఇప్ప‌టికే ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరు మోడీ వ‌ర్సెస్ కేజ్రీవాల్‌గా మారే అవ‌కాశం ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌.

ప్రాంతీయ పార్టీల్లో మెరుగు..

ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల్లో బీజేపీయేత‌ర‌, కాంగ్రెసేత‌ర కూట‌మికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మ‌రోవైపు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మూడో కూట‌మి కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను కూడ‌గట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దేశంలో ఎలాగో కాంగ్రెస్ పని అయిపోయింద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

 ఈ నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీలు క‌లిసి ఏర్పాటు చేసే కూట‌మే మోడీకి ప్ర‌త్యామ్నాయంగా మారుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు దానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యం వ‌హించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. దీంతో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో పోరు మోడీ వ‌ర్సెస్ కేజ్రీవాల్‌గా మారుతుంద‌ని చెబుతున్నారు.

ఏపీలో పాగా వేసేందుకు..

ఢిల్లీలో ఆప్ పాల‌న‌కు మెచ్చి ప‌క్క‌నే పంజాబ్‌లో ఆ రాష్ట్రానికి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టారు. కేజ్రీవాల్ న‌మూనాకు పంజాబీలు ఫిదా అయ్యార‌ని జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఆప్ ప్ర‌ధాని పీఠంపై గురి పెడుతుంద‌ని ఆప్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క్ర‌మంగా మిగ‌తా రాష్ట్రాల్లోనూ పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశాయి.

 ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా అవ‌త‌రించింద‌ని కాంగ్రెస్ స్థానాన్ని ఆక్ర‌మిస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. కేజ్రీవాల్ ఏదో ఒక రోజు దేశానికి ప్ర‌ధాని అవుతార‌ని అంటున్నారు.  ఈ నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీల కూట‌మికి అధ్య‌క్షుడిగా కేజ్రీవాల్‌.. మోడీని ఢీ కొంటార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాగా వేసేందుకు ఆప్ ఇప్పటికే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఏపీలో స‌ర్వేలు చేయించిన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ ఇత‌ర పార్టీల‌తో క‌లిసి ఆప్ పొత్తు పెట్టుకుంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. లేదంటే ఒంట‌రిగానే పోటీ చేసే సాహసం కూడా చేసే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

ఏదేమైనా పంజాబ్‌లో పార్టీ విజ‌యంతో సంచ‌ల‌నంగా మారిన కేజ్రీవాల్.. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీల‌కు దిక్సూచిగా మార‌బోతున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు మోడీకి తానే స‌రైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని భావిస్తున్న మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ గోవాలో ప‌ట్టు సాధించ‌లేక‌పోయింది. మ‌రోవైపు పంజాబ్‌లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను చిత్తుచేసిన‌ కేజ్రీవాల్పై భారీ అంచానాలు ఏర్ప‌డ్డాయి. దీంతో ఆయ‌నే భావి ప్ర‌ధాని అంటూ ఆప్ వ‌ర్గాలు ఆకాశానికెత్తుస్తున్నాయి.
Tags:    

Similar News