అన్న వస్తున్నారు..అందరికి భరోసా కల్పిస్తారు: ఐవి రెడ్డి

Update: 2017-07-09 14:14 GMT
మాట ఇచ్చి మడమ తిప్పడం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో లేదనే విషయం  రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసని, వైఎస్ ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సంక్షేమం కోసం ప్రకటించిన హామీల పట్ల అప్పుడే ప్రజల నుంచి అపార నమ్మకం కనిపిస్తోందని  గిద్దలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఐవి రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు రాజధానిలో వేలాది కార్యకర్తలు - నాయకులు - అభిమానులు - ప్రజల మధ్య ఘనంగా జరిగిన ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వాటికి సంబందించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. పార్టీ కి సంబందించిన వాళ్ళే కాక సామాన్య ప్రజానీకం సైతం ప్లీనరీలో జగన్ గారు చెప్పబోయే మాటల కోసం ఎదురు చూసిందని, టిడిపి అవినీతి పాలనలో జనం విసిగి పోయారని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ ఏం కావాలని చెప్పారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తన అస్మదీయులను మేపడానికే ప్రాధాన్యత ఇస్తున్న బాబుకు చరమగీతం పాడే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోందని మరో సారి స్పష్టమైందని చెప్పారు. ప్లీనరీ కి అపూర్వ స్పందన రావడం ఓర్వలేకే అప్పుడే తమ బుద్ధిని ప్రెస్ మీట్లలో బయట పెట్టుకుంటున్నారని ఐవి రెడ్డి ఎద్దేవా చేసారు.  ఈ దుశ్శానన - దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఐవి రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాహువు, కేతువు అయిన చంద్రబాబు - లోకేష్‌ లను సాగనంపుదామన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేని అసమర్థుడు చంద్రబాబు. అందరం ఒక్కటై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దామని  ఐవి రెడ్డి పిలుపునిచ్చారు.

ఇక జగన్ గారు అధికారంలోకి వచ్చాకా అమలు చేయబోయే నవరత్నాల్లాంటి  హామీలు ఇవ్వడమే కాక అవి ఎలా అమలు చేస్తామో కూడా సవివరంగా చెప్పడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. రైతు బాగుంటేనే రాష్ట్రము బాగుంటుంది అనే రాజన్న సిద్ధాంతాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పాటిస్తూ ఐదెకరాల లోపు సన్నకారు రైతులందరికీ 50 వేల రూపాయల వ్యవసాయ అవసరాల కోసం నేరుగా చేతికే వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పడం ద్వారా తెలుగు రైతు ఎవరి ముందు చేయి చాచే అవసరం రాకుండా చేస్తానని చెప్పడం పట్ల రైతులు ఇప్పటికే తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కేలామిటి రిలీఫ్ ఫండ్ ద్వారా రైతుకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆదుకునే వ్యవస్థ చేపడతామని చెప్పారు. ఆలా వైఎస్ ఆర్ ఆసరా పధకం కిందా డ్వాక్రా పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్ళకు అండగా నిలిచి వాళ్ళకు అందాల్సిన 15 వేల కోట్లు నేరుగా అందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం ద్వారా ఆడపడుచులకు అండగా నిలిచే అన్నయ్యగా మారుతానని చెప్పడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలా చాలీ చాలని పించనుతో అతి కష్టం మీద నెట్టుకొస్తున్న వృద్ధులకు అధికారంలోకి వచ్చిన మరుక్షణం రెట్టింపు చేస్తామని భరోసా ఇవ్వడం ప్రతి అవ్వా తాత మొహంలో నవ్వు చూడటం కోసమేనని చెప్పారు.

పిల్లల కోసం ప్రవేశ అమ్మ ఒడి పధకం ద్వారా ఏ బిడ్డా చదువుకు దూరం కాకుండా ఐదో తరగతి వరకు 500 - పది తరగతి వరకు 750 ఆపై ఇంటర్ కు 1000 రూపాయల చొప్పున ఇద్దరు బిడ్డలకు అందజేసి ఆపై చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వాళ్ళకు ఉన్నత విద్యనూ అందిస్తామని చెప్పారు. కులం మతం తేడా లేకుండా ప్రతి పేదవాడికి గూడు ఉండేలా పాతిక లక్షల ఇళ్ళ నిర్మాణానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలులోకి తెస్తామని చెప్పడం ద్వారా కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపినట్టు అవుతుందని చెప్పారు. టిడిపి హయంలో ఉన్నత లక్ష్యంతో ఉండాల్సిన ఆరోగ్యశ్రీ పధకాన్ని తమ స్వార్థం కోసం నిర్వీర్యం చేసారని ఎంత పెద్ద జబ్బుకైనా వర్తించేలా పేద వాడు అనారోగ్యంతో చనిపోకుండా ఉండేలా తన ప్రభుత్వం చూసుకుంటుందని జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ని కూడా పునరుద్ధరణ చేసి ప్రతి యువకుడు ఉన్నత విద్య ఉచితంగా అందుకునేలా తన ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ చెప్పారని, దానితో పటు జలయజ్ఞం పధకం కింద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతన్న కళ్ళలో వెలుగు చూస్తానని జగన్ చెప్పడం హర్షణీయం అని చెప్పారు. ఇక కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తున్న మద్యాన్ని కూడా దశల వారిగా నిషేదించే విధంగా చర్యలు తీసుకుంటామని. తాగి వస్తున్న భర్తల వల్ల నరకం చూస్తున్న ఆడబిడ్డల శోకాన్ని తుడవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి ఆదాయం గురించి జగన్ ఆలోచించడం లేదని కేవలం జనారోగ్యం గురించే తపిస్తారు కాబట్టే ఇలా ప్రకటించారని చెప్పారు.

జగన్ మోహన్ రెడ్డి గారు తాను ఏం చేయాలి అనే దాని గురించి చాలా స్పష్టంగా ఉన్నారని అదే ప్లీనరీ లో ప్రకటించిన హమీల్లోని ప్రతి అక్షరంలో వినిపించిందని ఐవి రెడ్డి అన్నారు. జగన్ అన్న మాటకు కట్టుబడి ఉంటారనే విషయంలో పార్టీ వాళ్ళకే కాక ప్రజలకు కూడా తెలుసనీ అందుకే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని ఐవి రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పట్ల, గిద్దలూరు నియోజకవర్గం గురించి ప్రత్యేక దృష్టితో అన్ని పరిష్కరిస్తాను అని తనతో పాటు జిల్లా పార్టీ పెద్దలు అందరికి వ్యక్తిగతంగా హామీ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. ప్లీనరీ ఇంత గొప్పగా ఆదరణ పొందటం పట్ల అందరికి కృతజ్ఞతలు తెలిపారు ఐవి రెడ్డి. త్వరలో ప్రతి జిల్లాలో , నియోజకవర్గం లో క్షేత్ర స్థాయి పర్యటన ఉంటుందని ఐవి రెడ్డి అన్నారు.

-ఐవి రెడ్డి
గిద్దలూరు వైఎస్ ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్ చార్జి  
ప్రకాశం జిల్లా
Tags:    

Similar News