ష‌ర‌తుల‌తో ఇవాంకా సెక్యురిటీ హ‌డావుడి

Update: 2017-11-14 04:23 GMT
ఏదైనా దేశానికి అమెరికా అధ్య‌క్షుడు వ‌స్తున్నాడంటే.. ఇక ఆ దేశ సీక్రెట్ స‌ర్వీస్ ద‌గ్గ‌ర నుంచి భ‌ద్ర‌తా వ్య‌వ‌హ‌రాలు చూసే వారి వ‌ర‌కు చేసే హ‌డావుడి అంతా ఇంతా కాదు.  అమెరికా అధ్య‌క్షుడు ఎక్క‌డికి వెళ్లినా.. అక్క‌డి భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను మొత్తం త‌మ చేతుల్లోకి తీసుకోవ‌టం క‌నిపిస్తుంది. తాజాగా ట్రంప్ రాకున్నా.. ఆమె కూతురు ఇవాంకా వ‌స్తున్న వేళ‌.. ట్రంప్ వ‌స్తే ఏ స్థాయిలో హ‌డావుడి చేస్తారో.. ఇప్పుడు అలాంటి హ‌డావుడే అమెరికా సెక్యురిటీ వ‌ర్గాలు చేస్తున్నాయి.

8వ గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్ లో పాల్గొనేందుకు ట్రంప్ కుమార్తె ఇవాంకా హైద‌రాబాద్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికా అధ్య‌క్షుడి స‌ల‌హాదారు హోదాలో వ‌స్తున్న ఆమెతో పాటు 500 మందితో కూడిన అమెరికా బిజినెస్ డెలిగేట్స్ కూడా వ‌స్తున్నారు. వీరే కాకుండా ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. మంత్రులు.. ప‌లు దేశాల ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు.

మిగిలిన వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇవాంకాకు సంబంధించిన సెక్యురిటీ వ్య‌వ‌హారాల‌న్నీ తామే చూసుకుంటామ‌ని అమెరికా భ‌ద్ర‌తా వ‌ర్గాలు స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. ఇవాంకా హాజ‌ర‌య్యే వేదిక‌ల‌కు సంబంధించిన భ‌ద్ర‌త మొత్తం త‌మ‌దేన‌ని వారు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ట‌ర్కీలో భ‌ద్ర‌త కోసం వ‌చ్చిన స్థానిక  సిబ్బంది ర‌ష్యన్ అంబాసిడ‌ర్ మీద కాల్పులు జ‌రిపిన నేప‌థ్యంలో.. ఇవాంకా పాల్గొనే వేదిక‌ల వ‌ద్ద భార‌త పోలీసులు ఎవ‌రూ ఆయుధాలు ప‌ట్టుకోకూడ‌ద‌న్న ష‌ర‌తు పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇది అమెరికా భ‌ద్ర‌తా వ‌ర్గాల‌కు.. భార‌త భ‌ద్ర‌తాధికారుల మ‌ధ్య వాద‌న‌ల‌కు తెర తీసింద‌ని చెబుతున్నారు. ఇవాంకా భ‌ద్ర‌త విష‌యంలో అమెరికా అధికారులు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటారో.. ప్ర‌ధాని మోడీ భ‌ద్ర‌త విష‌యంలో తాము అంతే జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంటుంద‌ని.. ఎస్పీజీ అధికారులు స్ప‌ష్టం చేస్తున్న‌ట్లుగా తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఏం చేయాల‌న్న విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

అమెరికా భ‌ద్ర‌తాధికారులు లేవ‌నెత్తిన రీతిలో అనుమ‌తులు ఇస్తారా?  మోడీకి వెన్నంటి ఉండే ఎస్పీజీ సిబ్బంది ఆయుధాలు లేకుండా ఉంటారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ స‌ద‌స్సుకు మొత్తం 1500 మంది హాజ‌రు కానున్నారు. దీంతో.. భారీ ఎత్తున భ‌ద్ర‌త ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు సైతం ముంద‌స్తుగా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
Tags:    

Similar News