ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టార్గెట్ గా ఇటీవలి కాలంలో ఒకింత దూకుడుగా ముందుకు సాగుతున్న ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అర్చక సమాఖ్య చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు మరో అస్త్రం సంధించారు. గ్రామాల్లో అర్చకుల వేతనాలు రూ.5వేలకు తగ్గించడంపై ఐవైఆర్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ.250కోట్ల ఫండ్ ఏర్పాటైందన్నారు. ఇతర ఆలయాల కంట్రిబ్యూషన్ కలిపితే రూ.500కోట్లు ఉన్నాయన్నారు. ఈ నిధితో అర్చకులకు నెలకు రూ.10వేల జీతం ఇవ్వొచ్చన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం జీతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఐవైఆర్ అన్నారు.
చినజీయర్ లాంటి స్వామీజీల చేతుల్లో ఉన్న ట్రస్టులు తమ అర్చకులకు రూ.20వేల జీతం ఇస్తోందని ఐవైఆర్ గుర్తు చేశారు. అర్చకుల వేతనాలు తగ్గించాలనే ఆలోచన సరికాదన్నారు. గ్రామాల్లో హిందుత్వం కనిపించకుండా పోవడానికి ఈ ఆలోచన చాలని ఐవైఆర్ లేఖలో పేర్కొన్నారు.దేవుడికి నిత్యం దీప, దూప నైవేద్యాలు అందించే అర్చకుల వేతనాలను ముఖ్య మంత్రి తగ్గించాలని అనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐవైఆర్ సూచించారు.
కాగా, దేవాదాయ శాఖ ఆదాయాన్ని స్వప్రయోజనాలకు వాడుకొనే ప్రభుత్వం అర్చకులను మాత్రం రోడ్డున పడేయాలని చూస్తోందని వైఎస్సార్సీపీ నేత చెరుకుచర్ల రఘురామయ్య మండిపడ్డారు నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, అర్చకులు ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులను తీవ్రంగా అవమానిస్తోందన్నారు. బ్రాహ్మణుల తరపున పోరాడే ఐవైఆర్ కృష్ణారావును అవమానకరంగా పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.500కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకూ కనీసం రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పోరేషన్‌ను పటిష్ట పరిచి వారి సంక్షేమానికి కృషి చేస్తామని రఘురామయ్య తెలిపారు.