‘హోదా’ బాబు చేతుల్లో ఉందంటున్న జగన్!

Update: 2018-03-12 16:24 GMT
రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం అనేది ఎవరి చేతుల్లో ఉంది. దాన్ని ఇవ్వవలసిన కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నదనే అంతా అనుకుంటూ ఉంటారు. కానీ వైఎస్ జగన్ మాత్రం.. ఈ వ్యవహారం చంద్రబాబు చేతుల్లోనే ఉన్నదని నొక్కి వక్కాణిస్తున్నారు. కేంద్రం చేతుల్లో ఉందనడానికి వారేమీ తమకు దానం ధర్మం చేయడం లేదని, అది మన హక్కు గనుక.. గట్టిగా  పోరాడి సాధించుకోవడం అనేది చంద్రబాబు చేతుల్లోనే ఉన్నదని.. జగన్ భాష్యం చెబుతున్నారు. చంద్రబాబు ఒక్క పని చేస్తే హోదా తప్పక వస్తుందని విశ్లేషిస్తున్నారు.

హోదా కావాలనే డిమాండ్ తో మరో పదిరోజుల్లో కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారు తీర్మానం పెట్టడం వరకు నిజమే గానీ.. దాన్ని చర్చకు అనుమతించడానికి తగిన మద్దతు అయినా లభిస్తుందా లేదా అన్నది అనుమానమే. జగన్ అవిశ్వాసం పెడితే.. తను మద్దతు తీసుకువస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ కల్యాణ్  కాడి పక్కన పారేశాడు. ఇప్పుడు హోదా కోసం ఒక్క జగన్ తప్ప మరెవ్వరూ పోరాటం సాగించడం లేదనే అనుకోవాలి. తెదేపా ఎంపీలు మొక్కుబడిగా ప్లకార్డుల ప్రహసనం నడిపించడం తప్ప కేంద్రంపై ఒత్తిడిపెంచే ప్రయత్నం చేయడంలేదు.

వైకాపా ఒకవైపు అవిశ్వాసానికి సిద్ధం అవుతోంటే.. అవిశ్వాసం నెగ్గుతుందా? టైం వేస్ట్ తప్ప సాధించేది ఏముంది? జగన్ డ్రామా ఆడుతున్నారు..? అంటూ.. చంద్రబాబునాయుడు.. నానా అవాకులు చెవాకులు పేలుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.  చేతనైతే హోదా కోసం జరిగే పోరాటానికి మద్దతు ఇచ్చి సఫలం అయ్యేలా సహకరించాల్సింది బదులు.. ఇలా కాళ్లు పట్టుకుని వెనక్కు లాగడం లాగా ఆయన చర్యలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

అయితే జగన్ మాత్రం.. అవిశ్వాసానికి తెదేపా కూడా మద్దతు ఇస్తే.. చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటే.. తప్పకుండా.. హోదా వస్తుందని అంటున్నారు. ఏపీలో రెండు పార్టీలూ ఐక్యంగా హోదా కోసం గళమెత్తుతున్నాయ్ అని అనిపిస్తే కేంద్రం కూడా భయపడుతుందనేది ఆయన వాదనగా ఉంది. అయితే.. ఇలా పని చక్కబడే సూచనలు చంద్రబాబుకు నచ్చుతాయా? ఆయనకు రాజకీయ ప్రయోజనాలు కావాలే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పడతాయా? అని పలువురు అనుకుంటున్నారు.
Tags:    

Similar News