ఉదాహ‌ర‌ణ‌తో బాబు పాల‌న‌ను తేల్చేసిన జ‌గ‌న్‌

Update: 2017-11-22 04:51 GMT
కొన్నిసార్లు అంతే.. భారీ అంచనాల‌తో మొద‌ల‌య్యే కార్య‌క్ర‌మాలు అంత ఎఫెక్టివ్ గా క‌నిపించ‌వు. ఏమిటిలా? అన్న ప్ర‌శ్న త‌లెత్తేలా ఉంటాయి. కానీ.. అది కూడా వ్యూహంలో భాగ‌మే త‌ప్పించి మ‌రేమీ కాద‌న్న విష‌యం కాస్త కాలం గ‌డిచిన త‌ర్వాతే తెలుస్తుంది. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌లో ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకుంటున్నాయి.

నిన్న‌టితో రెండు వారాలు పూర్తి చేసుకున్న పాద‌యాత్ర‌లో చెప్పుకోద‌గ్గ అంశం ఏమిటంటే.. హామీల్ని స‌రికొత్త‌గా ఇవ్వ‌టం. అయితే.. ఏపీ స‌ర్కారును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేట‌ట్లు జ‌గ‌న్ వ్యాఖ్య‌లు లేవ‌న్న‌ది నిజం. ప్ర‌భుత్వం వెనువెంట‌నే స్పందించే రీతిలో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ఉండ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది. అయితే.. త‌న అమ్ములపొదిలోని అస్త్రాల‌న్నింటిని ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు తీయ‌కూడ‌ద‌న్న వ్యూహంలో జ‌గ‌న్ ఉన్న విష‌యం తాజాగా ఆయ‌న ఇచ్చిన హామీని చెబుతుంద‌ని చెప్పాలి.

వైఎస్ హ‌యాంలో ల‌క్ష‌లాది మందికి అండ‌గా నిల‌వ‌ట‌మే కాదు.. మామూలు నేత‌ను మ‌హానేత‌గా మార్చిన ప‌థ‌కం ఏమైనా ఉందంటే అది ఆరోగ్య‌శ్రీ ప‌థ‌క‌మే. ఏపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చాక ఈ ప‌థ‌కాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించ‌ట‌మే కాదు.. ప‌దే ప‌దే దివంగ‌త మ‌హానేత పాల‌న‌ను గుర్తుకు తెచ్చేలా చేస్తున్నారు. వైఎస్ హ‌యాంలో అమ‌లైన ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి ఇప్పుడు అమ‌లవుతున్న ప‌థ‌కానికి మ‌ధ్య వ్య‌త్యాసాన్ని ప్ర‌స్తావిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

ఇలాంటి వేళ‌.. తాము అధికారంలోకి వ‌స్తే ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద‌నే ఎలాంటి ఆప‌రేష‌న్ అయినా.. అదెంత ఖ‌ర్చు అయినా తాము ఉచితంగా చేయిస్తామంటూ ఇచ్చిన హామీ ఇప్పుడు అంద‌రి నోట ఆస‌క్తిక‌రంగా మారింది.  భారీ హామీల‌తో బాబు స‌ర్కారును బెంబేలెత్తించ‌ట‌మే కాదు.. మాట‌ల‌తోనూ దూసుకెళుతున్నారు.

బాబు పాల‌న ఎంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టానికి ఎక్క‌డిక‌క్క‌డ స్థానిక అంశాల్ని ప్ర‌స్తావిస్తున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన బేతంచ‌ర్చ నాప‌రాయి ప‌రిశ్ర‌మ‌కే ఫేమ‌స్‌. ఇక్క‌డ భారీ ఎత్తున నాప‌రాయి ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. ఆ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల  వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను జ‌గ‌న్ తెర మీద తేవ‌ట‌మే కాదు.. ఆ వ‌ర్గం వారంతా గుండుగుత్తుగా త‌మ బాట‌లో న‌డిచేలా జ‌గ‌న్ మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

నాప‌రాయి ప‌రిశ్ర‌మ‌ను స్థాపిస్తే 20 మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని.. నాప‌రాయి పాలిష్ యూనిట్ల‌కు విద్యుత్ ఛార్జి యూనిట్ రూ.4.70 ఉండ‌గా.. వైఎస్ సీఎం అయ్యాక రూ.3.70 త‌గ్గించార‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక యూనిట్ కరెంటు ఛార్జీని రూ.8.70కు పెంచారంటూ ఉదాహ‌ర‌ణ‌తో స‌హా బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. సివ‌రేజ్ ఛార్జీల‌ను పెంచార‌న్నారు. న‌ష్టాలు భ‌రించ‌లేక పాలిష్ యూనిట్లు మూత‌బ‌డుతున్నాయ‌ని.. ఎస్సీలు బ్యాంకుల్లో నుంచి అప్పులు తీసుకొని పాలిష్ యూనిట్లు ఏర్పాటు చేస్తారన్నారు. అలాంటి వారంతా ప్ర‌భుత్వ త‌రుతో మూసివేయక త‌ప్ప‌టం లేదంటూ విమ‌ర్శించారు.

బాబు గొప్ప వ్య‌క్తి గా చెబుతార‌ని.. సింగ‌పూర్‌.. జ‌పాన్ ల నుంచి ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నార‌ని.. అయితే కొత్త ప‌రిశ్ర‌మ‌లు దేవుడెరుగు అని.. ఉన్నవే మూత‌ప‌డుతున్నాయ‌ని మండిప‌డ్డారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ దారుణ ప‌రిస్థితిని మార్చేస్తామంటూ ముందుకెళ్లిపోయారు.
Tags:    

Similar News