బాబు కు ద‌డ పుట్టిస్తున్న జ‌గ‌న్ కొంగ క‌థ‌

Update: 2017-12-13 04:35 GMT
ప్ర‌జాస‌మ‌స్య‌లపై అవ‌గాహ‌న‌.. వాటి ప‌రిష్కార దిశ‌గా ఏపీ విప‌క్ష నేత..  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర మ‌హా జోరుగా సాగుతోంది. ప‌దునైన విమ‌ర్శ‌లు.. అధికార‌పక్షం ఇరుకున పెట్టేలా ఆరోప‌ణ‌లు తెలుగు త‌మ్ముళ్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాద‌యాత్ర సంద‌ర్భంగా జ‌గ‌న్ వేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా  జ‌గ‌న్ చెబుతున్న కొంగ క‌థ విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. బాబు తీరును అద్దం ప‌ట్టేలా ఉన్న కొంగ క‌థకు ప్ర‌జ‌ల్లో భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. కొంగ క‌థ‌ను జ‌గ‌న్ చెబుతుంటే.. బాబు తీరుకు అతికిన‌ట్లుగా స‌రిపోతుంద‌న్న మాట వినిపిస్తోంది.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర 33వ రోజుకు చేరుకున్న వేళ‌.. అనంత‌పురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజ‌వ‌ర్గంలోని పాపంపేట‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో బాబు తీరుపై జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన కొంగ క‌థ‌కు భారీ స్పంద‌న ల‌భించ‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో బాబు తీరుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ జ‌గ‌న్ చెబుతున్న కొంగ క‌థ‌ను ఆయ‌న మాట‌ల్లోనే వింటే.. అదెంత ప్ర‌భావ‌వంతంగా ఉందో ఇట్టే తెలుస్తుంది.

"అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్లో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు నిండా చేపలుండేవి. ఆ చెరువుపై ఓ కొంగకు కన్ను పడింది. ఇవాళ మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కొల్లగొడుతున్నట్టుగా.. ఆ కొంగ విపరీతంగా చేపలను తినేసేది. కొన్నాళ్లకు కొంగకు ముసలితనం వచ్చేసింది. దీంతో చేపలను తినడం కష్టమైంది"

"అప్పుడా కొంగ చెరువు దగ్గరకొచ్చి ‘నేను ముసలిదాన్ని అయ్యాను. నా జీవితమంతా తప్పులు చేశాను. ఇక శేష జీవితంలో తప్పులు చేయదలుచుకోలేదు. నన్ను మీరంతా నమ్మండి’ అని చేపలకు చెప్పింది. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన చూసి, ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విని జనం నమ్మినట్టు చేపలన్నీ ఆ కొంగను నమ్మాయి. ఆ తర్వాత కొంగ ఒంటికాలుపై జపం చేస్తూ చేపలతో స్నేహంగా గడపసాగింది"

"కొద్ది రోజుల తర్వాత.. ‘మరో 15 రోజుల్లో ఈ చెరువు ఖాళీ కాబోతోంది. చేపలు పట్టేవాళ్లు మిమ్మల్ని ఎత్తుకు పోతారు’ అని చెప్పింది. అప్పుడు చేపలన్నీ ‘అయ్యో.. ఇప్పుడెలా.. ఎలా..’ అని కంగారు పడ్డాయి. మాకు మీ మాదిరి పరిపాలన దక్షత లేదు. మేం ఎలా గట్టెక్కాలి? అని ఆ కొంగను అడిగాయి. నువ్వే ఏదైనా ఆలోచన చెప్పమని కోరాయి. అప్పుడా కొంగ కొంత సేపు ఆలోచిస్తున్నట్లు నటించి.. కొంత దూరంలో ఓ పెద్ద చెరువు ఉందని, అందులోకి వెళ్తే ఎవరూ రారు అంటూ చంద్రబాబు జనాన్ని నమ్మించిన తరహాలో ఆ కొంగ చేపలను నమ్మించింది"

"ఆ చెరువులోకి ఎలా పోవాలని చేపలు అడిగితే.. ‘దానిదేముంది.. మీ అందరికీ నేను మేలు చేస్తా.. అన్ని బాధలు నేనే పడతాను.. నాకు అనుభవం ఉంది’ అంటూ.. రుణమాఫీ చేస్తానని, ఇంటింటికీ ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు మోసం చేసినట్టు ఆ కొంగ కూడా పోజు కొట్టింది. ఒకరో ఇద్దరో నా మీద ఎక్కండి.. నేను తీసుకెళ్లి పక్క చెరువులో విడిచి పెడతానని కొంగ చెప్పింది. ఇలా రోజుకు కొన్ని చేపలను ఎత్తుకెళ్లి దారి మధ్యలోనే వాటిని తినేసింది"

"ఈ మధ్యన స్కూల్‌ పిల్లలు నా వద్దకు వచ్చి ‘నీతిలేని కొంగ.. చంద్రబాబు దొంగ’ అంటున్నారు. చంద్రబాబు పాలన చూస్తే.. నిజంగా పిల్లలు ఈ కొంగ కథ చెప్పుకునే పరిస్థితి వచ్చింది" అని మండిప‌డ్డారు.  ఎన్నిక‌ల‌కు ముందు రుణాలు మాఫీ చేస్తాన‌ని రైతుల్ని న‌మ్మించిమోసం చేశాడ‌ని.. పొదుపు సంఘాల అక్క‌చెల్లెమ్మ‌ల్ని.. ఉద్యోగాలు ఇస్తాన‌ని నిరుద్యోగుల్ని చంద్ర‌బాబు మోసం చేశార‌న్నారు.
Tags:    

Similar News