అన్నంత ప‌ని చేస్తున్న జ‌గ‌న్

Update: 2015-09-17 10:29 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ దూకుడు మీద ఉన్నారు. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా క‌దులుతున్న జ‌గ‌న్‌...అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సమస్య ఎక్కడుంటే జగన్‌ అక్కడుంటున్నారు అన‌డం అతిశ‌యోక్తి కాదేమో.

కొద్దిరోజుల క్రితం కొత్త మాజేరులో విషజ్వరాల బాధితులకు పరామర్శించారు. జ్వరాలతో జనం చస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ ఆందోళన కూడా చేశారు. ఇక రాజమండ్రి రోడ్డు ప్రమాద బాధితులను కలిసి ఓదార్చారు. నష్టపరిహారాన్ని పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఏపీకి కీల‌క అంశం అయిన ప్రత్యేకహోదాపై జోరు కొనసాగిస్తున్నారు.  హోదా పోరులో భాగంగా యూనివర్సిటీ బాట పట్టారు. తిరుపతిలో  వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల విద్యార్థులతో ప్రత్యేకహోదా అవసరంపై చర్చాగోష్టి నిర్వహించారు.

మ‌రోవైపు కొద్దిరోజులుగా రగులుతున్న బందర్‌ పోర్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన బాధితుల ఆందోళ‌న‌ను జ‌గ‌న్ తాజా అంశంగా ఎంచుకున్నారు. పోర్టు భూసేకరణ బాధితులతో జ‌గన్‌ ముఖాముఖి స‌మావేశం కాబోతున్నారు. మ‌చిలీప‌ట్నం మండ‌లం క‌ర‌గ్రహారం - తుమ్మల చెరువు - పొట్లపాలెం గ్రామాల‌ను సంద‌ర్శించి స్థానిక ప్రజ‌ల‌తో భేటి అవుతారని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బందర్‌ పోర్టు నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోతున్న రైతుల‌తో, స్థానికుల‌తో జ‌గ‌న్ స‌మావేశం కానున్నారని పార్టీ  శ్రేణులు వివ‌రిస్తున్నాయి. తద్వారా ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచ‌నున్నార‌ని పార్టీ నాయ‌కు అంటున్నారు. ప్ర‌జా సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తాన‌ని ప్ర‌క‌టించి వైసీపీ అధినేత ఆ దిశ‌గా వేగంగానే అడుగులు వేస్తున్న‌ట్లుంది.
Tags:    

Similar News